ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
EVM VVPAT Case: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిపై ప్రజలెవరిలోనూ ఆందోళన ఉండకూడదని ఈసీ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
EVM VVPAT Verification Case: ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్ని చాలా పారదర్శకంగా నిర్వహించాల్సిన అసరముందని ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పింది. వీవీప్యాట్, ఈవీఎమ్ కేసు విచారణలో భాగంగా ఇలా స్పందించింది. వీవీప్యాట్ స్లిప్స్‌ని ఈవీఎమ్‌తో ఎలా వెరిఫై చేస్తారో వివరంగా చెప్పాలని ఈసీని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. వీవీప్యాట్‌తో వేసిన ఓట్లను EVM మెషీన్‌తో పూర్తి స్థాయిలో క్రాస్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది. ఓటింగ్ ప్రక్రియ సరిగ్గా జరిగిందో లేదో తెలసుకోడానికి ఉపయోగపడే ఈ ఓట్ వెరిఫికేషన్ సిస్టమ్‌పై దృష్టి పెట్టాలని వెల్లడించింది. అయితే...ప్రస్తుతానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా 5 ఈవీఎమ్‌లను ఎంపిక చేసుకుని VVPAT Verification చేపడుతున్నారు. పిటిషనర్‌ల తరపున వాదించిన అడ్వకేట్ నిజాం పాషా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ పూర్తైన తరవాత వీవీ ప్యాట్ స్లిప్‌ని ఓటర్ తనతో పాటు తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించాలని వాదించారు. అంతే కాదు. ఇలా 5 ఈవీఎమ్‌లకే పరిమితం కాకుండా 100% వెరిఫికేషన్ చేయాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.
VVPAT cross-verification: The Supreme Court asks ECI to look into the allegation made by advocate Prashant Bhushan that during a mock poll in Kasaragod, Kerala four EVMs were recording one extra vote for BJP.
— ANI (@ANI) April 18, 2024
Supreme Court observes that this is electoral process and there has to… pic.twitter.com/T2GEOsK3oW
ఈ పిటిషన్‌పై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తరపున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. కేరళలోని కసర్‌గడ్‌లో జరిగిన మాక్ పోలింగ్‌ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాలుగు ఈవీఎమ్‌లను వీవీప్యాట్‌లతో పోల్చి చూస్తే బీజేపీకి అదనపు ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ సమర్థంగా జరిగేలా చూసుకోవాలని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం లేదన్న అనుమానాలు ఎవరికీ కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అంతే కాదు. ఎన్నికలను పారదర్శకంగా ఎలా నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈసీ వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది. ఇదే సమయంలో కోర్టు ఈసీని మరో ప్రశ్న వేసింది. వీవీప్యాట్ ప్రింటర్‌లో ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉంటుందా అని అడిగింది. దీనికీ సమాధానమిచ్చింది ఎన్నికల సంఘం. అందులో ఎన్నికల గుర్తుల్ని స్టోర్ చేసుకునే విధంగా 4MB ఫ్లాష్ మెమరీ ఉంటుందని వెల్లడించింది.
Voter Verified Paper Audit Trail (VVPAT) ద్వారా ఓ ఓటర్ తన ఓటు సరైన అభ్యర్థికే నమోదైందా లేదా అన్నది వెరిఫై చేసుకోవచ్చు. ఓటు వేసినప్పుడు ఓ పేపర్ స్లిప్ ప్రింట్ అవుతుంది. దాన్ని ఓ సీల్డ్ కవర్‌లో ఉంచుతారు. ఎప్పుడైనా లెక్కింపు విషయంలో వివాదం తలెత్తితే వాటిని తెరిచి ఈవీఎమ్‌తో వెరిఫై చేస్తారు. అయితే...ఇప్పుడు కేవలం ఎంపిక చేసుకున్న ఈవీఎమ్‌లలోనే ఈ వెరిఫికేషన్ చేస్తున్నారు. చాలా రోజులుగా దీనిపైనే వివాదం కొనసాగుతోంది. ఈవీఎమ్ ప్రక్రియలో ఓటింగ్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అందుకే ప్రతి ఓటునీ క్రాస్ వెరిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.