President Murmu : ఎన్డీఏ అభ్యర్థికి అనూహ్యమైన మద్దతు - ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యం ఖాయమే !
ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతోంది. ఆమెకు యశ్వంత్ సిన్హా కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోంది.
President Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించడం ఖాయమయింది. రోజులు గడిచే కొద్దీ మద్దతు ప్రకటించే పార్టీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టీడీపీ, శివసేన కూడా మద్దతు పలికాయి. ఎన్డీయే కంటే ముందే విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ సంఖ్యాబలం కారణంగా బీజేపీ కూటమి పైచేయిగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా... కొంతకాలం క్రితం వరకు క్రియాశీలంగా ఉన్న నాయకుడు. గత ఏడాది తృణమూల్ కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఆయన అంత యాక్టివ్ గా లేరు. తాను ఓడిపోతానని ముందు ఊహించిన సిన్హా... గట్టి పోటీ ఇచ్చేందుకు మొదట ప్రయత్నించారు. కానీ వరుసగా పార్టీలు ఆయనకు హ్యాండిచ్చాయి. ద్రౌపదీ ముర్ము స్వరాష్ట్రంలో ఒడిశాలో అధికార పార్టీ అయిన బిజు జనతా దళ్ కూడా ఆమెకే మద్దతు ప్రకటించింది
యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మాత్రమే గట్టి మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత.. బీజేపీ, కాంగ్రెస్ విధానాలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ తెరపైకి తెచ్చారు. పైగా రాష్ట్రంలో బీజేపీని ప్రధాన శత్రువుగా చూపించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాలని చూస్తున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజే సిన్హాను హైదరాబాద్ రప్పించడం, బీజేపీ వారి కంటే పెద్ద హోర్డింగులు పెట్టించడం కూడా అందుకేనని భావించాలి. ఇక కాంగ్రెస్ భాగస్వామ్యం ఉందన్న పేరుతో తటస్థ వైఖరిని ఎంచుకుంటే.. పరోక్షంగా బీజేపీకి సహకరించిందన్న ఆరోపణల్ని విపక్షాల నుంచి టీఆర్‌ఎస్ ఎదుర్కొనాల్సివస్తుంది. జాతీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న కేసీఆర్‌కు ఈ విషయంలో విపక్ష ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం ఉంటుందని, అందుకే విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ మాత్రమే యశ్వంత్ సిన్హా వైపు గట్టిగా నిలబడినట్లయింది.
ముందుగా చెబితే ముర్ముకే మద్దతిచ్చేవాళ్లమన్న మమతా బెనర్జీ
మమత బెనర్జీ మాట మార్చారు. ముర్మును నిలబెడుతున్నట్లు ముందే తమకు చెప్పి ఉంటే.. మద్దతిచ్చే విషయం పరిశీలించే వారమని దీదీ ప్రకటించి చాలా మందిని ఆశ్చర్యపరిచారు. నిజానికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలంటూ అందరినీ ఒక తాటిపైకి తెచ్చిన నాయకురాలు కూడా మమతే.. ముందుగా ఆమె విపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్ పేరును ప్రస్తావించి.. ఆ వ్యూహం ఫలించకపోవడంతో సిన్హా పేరును ఖాయం చేశారు. ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ పేరును ప్రకటించడంతో మమత డిఫెన్స్ లో పడిపోయారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ వ్యూహం తెలిసి ఉంటే.. విపక్షాల తరపున కూడా మహిళను నిలబెట్టేవాళ్లమని మమత చెబుతున్నారు. ఏదైమైనా సిన్హా పరాజయం ఖాయమని ఆమె బహిరంగంగానే అంగీకరిస్తున్నారు.
టీడీపీ, శివసేన, జేఏంఎం కూడా మద్దతు
కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికింది కానీ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీజేపీకి ఓటేయలేని పార్టీలు మాత్రం తప్పని సరిగా యశ్వంత్ సిన్హాకే ఓటేస్తారు. వారు తప్ప మిగిలిన వారు ముర్ముకే మద్దతు ఇస్తారు. ఈ కారణంగా భారీ మెజార్టీ ఖాయమని అంచనా వేస్తున్నారు. అంటే ఎన్నికల కంటే ఫలితం తెలిసిపోయింది..