TS High Court: నిమజ్జన సమస్యలపై శ్రద్ధ లేదా? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం
వినాయక నిమజ్జనంపై సూచనలు ఇవ్వాలని ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిమజ్జన సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది.
వినాయక నిమజ్జనంపై సూచనలు ఇవ్వాలని ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా, కాలుష్య పరిస్థితుల్లో వినాయక నిమజ్జనంపై ప్రభుత్వ స్పందన సరిగా లేదని అభిప్రాయపడింది. నిమజ్జన సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఆంక్షలపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు రిజర్వ్ చేసింది.
హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ అనే వ్యక్తి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం నేడు మరోసారి విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇటీవల నిమజ్జనంపై సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
దీనికి స్పందనగా.. ప్రభుత్వ విభాగాలు నివేదిక ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక అందిస్తే ఎలా? అని జీహెచ్‌ఎంసీని ప్రశ్నించింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని? ధర్మాసనం ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేసింది.
48 చెరువులు, కొలనుల్లో నిమజ్జన ఏర్పాట్లు..
జీహెచ్‌ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ నిమజ్జన ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా లక్ష వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం, సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని స్పష్టం చేసింది.
కాలుష్యం, పర్యావరణ మార్పులతో వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఇప్పటికే పలు దేశాలు సతమతమవుతున్నాయనే విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో జనం గుంపులుగా చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెబుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.