Telangana Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణం
Telangana Assembly Sessions: కొత్తగా ఏర్పాడిన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.
Telangana Assembly Sessions: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వరంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ చర్చిస్తుంది.
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్
కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి సమావేశం కావడంతో రెగ్యులర్ స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఎన్నికల సభ్యుల్లో ఆయన సీనియర్ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించారు. నోటిఫికేషన్ కూడా జారీ అయింది. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. మిగతా ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణం చేయిస్తారు. 11 గంటలకు సమావేశమయ్యే సభలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
ఎమ్మెల్యేల ప్రమాణ తర్వాత శనివారం సాయంత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం స్పీకర్ ఎన్నికల ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సర్కారు ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నికల లాంఛనం కానుంది.
బీజేపీ ఎమ్మెల్యే దూరం
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపిక చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం జరిగే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. గతంలో కూదా రాజా సింగ్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. 2018లో ప్రొటెం స్పీకర్‌గా అప్పటి సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ను నియమించారు. దీంతో రాజా సింగ్ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. తర్వాత ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ దూరం
తుంటి ఎముకకు గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు దూరంగా ఉండబోతున్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలోని బాత్‌రూంలో జారి పడ్డారు. దీని కారణంగా తుంటి ఎముక విరిగింది. దీనికి శుక్రవారం రాత్రి చికిత్స చేశారు. దీంతో ఆయన సభకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది.
మొదటి రోజు ఎమ్మెల్యే ప్రమాణం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మూడో రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. నాల్గో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ ఉంటుంది. నాలుగు రోజుల సమావేశాలు కారణంగా శాసన సభ చుట్టూ భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచే ఆంక్షలు మొదలయ్యాయి.
అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఎమ్మెల్యేలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేసిన సర్టిఫికేట్ ఒరిజినల్, రెండు జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది. వాటిని శాసనసభ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వారి లైఫ్‌పార్టనర్‌కు చెందిన నాలుగు ఫొటోలు తీసుకురావాలి. వారి బయోడేటాను కూడా ఇవ్వాలి. వారికి ఎమ్మెల్యే విధివిధానాలు తెలిపే హ్యాండ్‌బుక్ ఇస్తారు.