Andhra News: 'ఏపీలో దొంగ ఓట్లపై చర్యలు తీసుకోండి' - పారదర్శక ఓటర్ల జాబితా కోసం చర్యలు చేపట్టాలన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
TDP MP Galla Jayadev: ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్లమెంటులో ఈ అంశంపై తన గళాన్ని వినిపించారు.
TDP MP Galla Jayadev Voice in Parliament on Irregularities of AP Voters List: ఏపీలో ఓటర్ల జాబితాలో (Voters List) అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంటులో (Parliament) టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) తన వాణి వినిపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధి విధానాలపై బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశాలు, నిబంధనలు ఏపీలో ఎక్కడా అమలు కావడం లేదని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించే పరిస్థితి లేదని పార్లమెంట్ దృష్టికి తెచ్చారు. 'ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఆదేశాలను డీఆర్వోలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పాటించడం లేదు. ఓటర్ల జాబితాను ఒత్తిళ్లకు లొంగి మార్చేస్తున్నారు. ఈసీ ఆదేశాలు ఒకలా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది.' అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని ఆధారాలతో సహా వివరించినట్లు గుర్తు చేశారు. ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటే, కింది స్థాయి అధికారులపైకి ఉన్నతాధికారులు నెపం నెట్టేస్తున్నారని అన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే విషయాన్ని పార్లమెంటుకు వివరించారు.
'కేంద్రం జోక్యం చేసుకోవాలి'
తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఆ అధికారిక ప్రకటన తర్వాత కూడా అందుకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.?. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించేలా చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. 'ఏపీలో ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వెంటనే స్థానికులతో సంబంధం లేని అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించడంపై దృష్టి సారించాలి. ఓటర్ల జాబితాను సరిదిద్దాలి.' అని తెలిపారు.
పరస్పరం ఫిర్యాదులు
ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఈసీకి ఈ అంశంపై దృష్టి తెచ్చారు. అధికార వైసీపీ నేతలే ఓటర్ల జాబితాలో టీడీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అటు, వైసీపీ నేతలు సైతం డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఈవో కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్క్రూటినీ చేసి డబుల్ ఓట్లు ఉంటే తొలగించాలని ఆదేశించారు.
రాష్ట్రానికి ఈసీ బృందం
మరోవైపు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. ఈ నెల 22, 23 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్దతపై భేటీ నిర్వహించనుంది. కాగా, ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావొచ్చనే చర్చ సాగుతోంది. అటు, రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.
Also Read: Andhra News : పుట్టినరోజు వేడుకల పేరుతో 100 కోట్లు లూఠీ - సీఎం జగన్‌పై టీడీపీ ఆగ్రహం !