Afghanistan President: అఫ్గాన్ తదుపరి అధ్యక్షుడు 'బరాదర్' గురించి షాకింగ్ విషయాలు!
అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు ముందడుగు వేస్తున్నారు. తదుపరి అఫ్గాన్ అధ్యక్షుడ్ని నేడు ప్రకటించనున్నారు. మరి అతని గురించి ఈ నిజాలు తెలుసా?
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ధాటికి పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం దేశం అల్లకల్లోలంగా మారింది. ఎవరైనా తమను రక్షిస్తారేమోనని వేచిచూస్తున్నారు. అయితే చాలా దేశాలు తమ పౌరులను అఫ్గాన్ నుంచి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఇలాంటి తరుణంలో అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు రెడీ అవుతున్నారు. తదుపరి అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ను ఎంపిక చేసింది తాలిబన్ల బృందం. ఆయన ప్రస్తుతం దోహాలో ఉన్నారు.
అయితే దోహా నుంచి రాజధాని కాబూల్ వచ్చి తదుపరి అధ్యక్షుడిపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపైనా ఈ మేరకు తాలిబన్ల నేతలు కీలక ప్రకటన చేయనున్నారు.
ఎవరీ బరాదర్..
తాలిబన్ రాజకీయ విభాగానికి ఈయనే అధిపతి. 1970ల్లో అఫ్గాన్‌ను సోవియట్ ఆక్రమించుకోవడంతో తిరుగుబాటు బృందంలో చేరాడు. 'అఫ్గాన్ ముజాహిదీన్' తరఫున పోరాడాడు. సోవియట్ దళాలు వెళ్లిపోయిన తర్వాత దేశంలో అవినీతి, అంతర్యుద్ధం చెలరేగాయి. అప్పటికే ఒంటి కన్ను ముల్లా ఒమర్‌తో కలిసి మదర్సాను స్థాపించిన బరాదర్... తర్వాత అతడితో కలిసి తాలిబన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మద్దతుతో ఆ సంస్థ ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుని, 1996లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా ఒత్తిడి కారణంగా 2010లో పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ, అగ్రరాజ్య సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) బృందాలు బరాదర్‌ను అరెస్టు చేశాయి. అయితే, ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2018 అక్టోబరులో పాకిస్థాన్ అతడిని విడిచిపెట్టింది.
ప్రపంచ రాజకీయాలు..
అఫ్గానిస్థాన్ లో అధికార మార్పిడి ప్రపంచస్థాయి రాజకీయాలపైనా ప్రభావం చూపనుంది. ఇప్పటికే చైనా, రష్యా, టర్కీ, పాకిస్థాన్ నూతనంగా ఏర్పాటు కానున్న తాలిబన్ల ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితికి అమెరికాయే కారణమని ప్రపంచమంతా వాదిస్తోంది. కాబూల్ లోని తమ దౌత్య కార్యాలయాలను తాము ఖాళీ చేయబోమని చైనా, రష్యా, పాకిస్థాన్ ప్రకటించాయి.
అఫ్గానిస్థాన్ లో శాశ్వతంగా తాలిబన్ల అధికారం నడుస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ఓటమి అఫ్గాన్ లో శాంతికి దోహదపడుతుందని ఇరాన్ అభిప్రాయపడింది. మరోవైపు బానిస సంకెళ్లను అక్కడి ప్రజలు తెంచేశారని పాక్ తెలిపింది.
భారత్ ఏమంటోంది?
అఫ్గాన్ ప్రజలు, మహిళలు, పిల్లలు భయాందోళనలో జీవిస్తున్నారని ఐక్యారాజ్యసమితికి భారత్ తెలిపింది.
ALSO READ: