Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో SIపై దాడి, హుటాహుటిన ఘటనా స్థలానికి ఎస్పీ
Srikakulam: సారా తయారీ కేంద్రాలపై కానిస్టేబుళ్లతో సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి సమీపంలో కొందరు దాడికి దిగడంతో ఎస్ఐ ముఖంపై గాయాలయ్యాయి.
Srikakulam News: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి ఎస్ఐ సీతారామ్ పై దాడి జరిగింది. ఆయన ఆదివారం ఆ మండలంలోని సతివాడ పంచాయతీ కొత్తగూడ సమీపంలో సారా తయారీ కేంద్రాలపై కానిస్టేబుళ్లతో సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి సమీపంలో కొందరు దాడికి దిగడంతో ఎస్ఐ ముఖంపై గాయాలయ్యాయి. రక్తసిక్తం కావడంతో ఆయన్ను కొత్తూరు ఆసుపత్రి కి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యానికి పాలకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సీతారామ్ ను పార్వతీపురం ఎస్సీ వి. విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ, డీఎస్పీ దిలీప్ కుమార్, సుభాష్ పరామర్శించారు. జరిగిన ఘటనపై ఎస్సీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎవరెవరు వెళ్లారు, ఎవరికి గాయాలు అయ్యాయి అనే దానిపై కూడా సంబంధిత అధికారుల నుంచి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలను అందజేయాలని సూచించారు.
ధైర్యంగా ఉండాలని ఎస్ఐడి అన్నారు. జరిగిన ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎస్ఐ సీతారామ్ ను పాలకొండ ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్టు పోలీసు అధికారులకు తెలిపారు. కాగా ఈ సంఘటన భామిని మండలంతోపాటు పోలీసు వర్గాల్లో కూడా కలకలం రేకెత్తించింది. ఎస్పీ రాత్రికి రాత్రి రావడంతో పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది.