Telangana News: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? - ప్రయాణికులకు గుడ్ న్యూస్, 20 ప్రత్యేక రైళ్ల ప్రకటన
Special Trains For Sankranthi: సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల కోసం ద.మ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పలు మార్గాల్లో 20 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.
South Central Railway Special Trains For Sankranthi: సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ (Railway Department) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లు (Special Trains) కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లను హైదరాబాద్ - తిరుపతి, కాచిగూడ - కాకినాడ టౌన్ రూట్లలో నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇవి అనుకూలంగా ఉండనున్నాయి. ఈ నెల 28 నుంచి జనవరి 26 వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
ప్రత్యేక రైళ్లు ఇవే
- కాచిగూడ - కాకినాడ టౌన్ (రైలు నెం - 07653) ఈ నెల 28న (గురువారం) రాత్రి 8:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
- కాకినాడ టౌన్ - కాచిగూడ (రైలు నెం - 07654) ఈ నెల 29న (శుక్రవారం) సాయంత్రం 5:10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.
- హైదరాబాద్ - తిరుపతి (రైలు నెం 07509) గురువారం రాత్రి 7:25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉండనుంది.
- తిరుపతి - హైదరాబాద్ రైలు (07510) శుక్రవారం రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.
- కాచిగూడ - కాకినాడ టౌన్ - కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07653/07654) మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
- హైదరాబాద్ - తిరుపతి - హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07509/07510) సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ. నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్
తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ క్రమంలో ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చిన తెలుగు వారంతా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఏపీకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే ఫుల్ అయ్యాయి. చాలా రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా లేకుండా రిగ్రెట్ అని కనిపిస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ, శ్రీకాకుళం, భువనేశ్వర్ వైపు వెళ్లే రైళ్లల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రధానంగా గోదావరి, ఫలక్ నుమా, వందే భారత్, విశాఖ ఎక్స్ ప్రెస్, గరీభ్ రథ్, దురంతో, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, జన్మభూమి వంటి రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఈ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కనీసం వాటికి అదనపు బోగీలైనా ఏర్పాటు చేయాలంటున్నారు. రద్దీగా ఉండే ఈ మార్గాల్లో అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు.