Shiv Sena MP Sanjay Raut: షిండే శిబిరం నుంచి నాకూ ఆఫర్ వచ్చింది, మభ్యపెడితే లొంగిపోను-సంజయ్ రౌత్
షిండే శిబిరం నుంచి తనకూ పిలుపు వచ్చిందని, శివసేన సైనికుడిని కాబట్టే లొంగిపోలేదని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శివసేన సైనికుడిని..అందుకే వెళ్లలేదు : సంజయ్ రౌత్
మహారాష్ట్ర రాజకీయాల్లో రెబల్ ఎమ్మెల్యేలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా 50 మంది ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లిపోయి రాజకీయ అనిశ్చితి తీసుకొచ్చారు. శివసేనలోని చాలా మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి మెల్లగా తన శిబిరంలోకి లాక్కున్నారు షిండే. ఈ క్రమంలోనే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌నూ తమవైపు రప్పించుకునేందుకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ ప్రస్తావించారు. "షిండే శిబిరంలోకి రావాలని నాకూ ఆఫర్ వచ్చింది. కానీ నేను అసలు సిసలైన బాలాసాహెబ్ ఠాక్రే సైనికుడిని. అందుకే వెళ్లలేదు. వెళ్లాలనుకుంటే అప్పుడే వెళ్లిపోయేవాడిని" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈడీ విచారణకు హాజరు కావటంపైనా ఆయన స్పందించారు.
నేనే తప్పు చేయలేదు, ఎందుకు భయపడాలి: సంజయ్ రౌత్
"నేనెంతో ధైర్యంగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు. పది గంటల పాటు ఈడీ ఆఫీస్‌లోనే ఉండి బయటకు వచ్చాను. నిజంగా నేను తప్పు చేసుంటే ఎప్పుడో షిండే వైపు వెళ్లిపోయేవాడిని" అని అన్నారు. ఏక్‌నాథ్ షిండే శివసేన సీఎం కాదని, ఇప్పటికే ఇదే విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారని చెప్పారు. "ఇదంతా భాజపా వ్యూహమే. శివసేనను బలహీనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఏక్‌నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయటానికి కారణమూ ఇదే" అని విమర్శించారు సంజయ్ రౌత్. ఎంపీలతో భేటీ జరిగిన విషయాన్ని వెల్లడించారు. 18 మంది ఎంపీల్లో దాదాపు 15 మంది ఎంపీలు సమావేశానికి హాజరయ్యారని, నిజమైన శివసేన సైనికులు ఎలాంటి ఆఫర్లకు లొంగిపోరని అన్నారు. నిజమైన శివసేన ఉద్దవ్ ఠాక్రేతోనే ఉందని స్పష్టం చేశారు. శివసేనలో చీలికలు తెచ్చేందుకు భాజపా చాలా వ్యూహాత్మంగా ప్లాన్ అమలు చేసిందని శివసేన ప్రతినిధి ఒకరు అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలను కూడగట్టటం ఇందులో భాగమే అని ఆరోపించారు.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రౌత్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన అన్నిప్రశ్నలకూ సమాధానమిచ్చానని చెప్పారు సంజయ్ రౌత్. మరోసారి అధికారులు నోటీసులు అందిస్తే తప్పకుండా విచారణకు హాజరవుతానని, అధికారులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోవా వెళ్లారు షిండే. తనకు మద్దతు తెలిపిన వారందరితోనూ సమావేశమయ్యారు. సీఎంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తొలిరోజే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలు నమ్మే శివసైనిక్" ముఖ్యమంత్రి అవటం పట్ల మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. తనకు మద్దతు తెలిపిన ఆ 50 మంది ఎమ్మెల్యేల వల్లే ఇదంతా సాధ్యమైందని వెల్లడించారు.
Also Read: Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్
Also Read: KCR on BJP: మోదీ మాట్లాడటం ఆపి మా ప్రశ్నలకు జవాబు చెప్పండి :కేసీఆర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

