Sharad Pawar Resign: శరద్ పవార్ సంచలన నిర్ణయం - ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా!
Sharad Pawar Resign: ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించి శరద్ పవార్ అందరినీ షాక్ కు గురిచేశారు.
Sharad Pawar Resign: ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు శరద్ పవార్ తెలిపారు. ముంబైలో పుస్తక ప్రచురణ కార్యక్రమంలో పవార్ మాట్లాడుతూ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి పదవీ విరమణ పొందాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈక్రమంలోనే తాను రాజీనామా చేస్తున్నాని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు.
#WATCH | "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
— ANI (@ANI) May 2, 2023
మొదటి నుంచి షాకింగ్ నిర్ణయాలు, ఆలోచనలే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ రాజకీయం మొదటి నుండి అంచనాలకు భిన్నంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కూడా అలాంటి ఓ కీలక నిర్ణయమే. ఈ మధ్య పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ శరద్ పవార్ ఆయనకు బహిరంగంగా మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ తర్వాత గౌతమ్ అదానీపై పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందులో ఎన్సీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా ఉంది. కానీ శరద్ పవార్ మాత్రం గౌతమ్ అదానీకి బహిరంగంగానే సపోర్ట్ చేస్తూ అలాంటి కమిటీ ఏర్పాటు చేసి విచారించాల్సిన అవసరం లేదని అన్నారు.
మోదీ విద్యార్హత సమస్య కాదు
కొన్ని రోజులుగా విపక్ష పార్టీలు మోదీ విద్యార్హతలపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ పవార్ మాత్రం మోదీ విద్యార్హతలు సమస్యే కాదని అన్నారు. మిత్రపక్షాలన్నీ బీజేపీని ఏదో విధంగా టార్గెట్ చేసుకుంటే పవార్ మాత్రం ఇలాంటి వైఖరి కనబరచడంపై విమర్శలు వచ్చాయి. పవార్ తన తదుపరి రాజకీయ ఎత్తుగడ కోసమే బీజేపీకి సహకరిస్తున్నారన్న ఊహాగానాలకు తెరతీసింది.
విడిపోతారు, కలుస్తారు, మళ్లీ విడిపోతారు.. ఇది పవార్ రాజకీయం
ఎన్సీపీని అధికారంలో ఉంచేందుకు శరద్ పవార్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడికి శరద్ పవార్ రాజకీయం సరిగ్గా సరిపోతుంది. 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. కానీ అదే శరద్ పవార్ అదే సంవత్సరం మహారాష్ట్రలో అధికారం పంచుకోవడానికి కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటాలియన్ మూలానికి చెందిన వారని చెబుతూ కాంగ్రెస్ నుంచి వేరు కుంపటి పెట్టారు శరద్ పవార్. తిరిగి కాంగ్రెస్ తో కలిసినప్పుడు మాత్రం ఆ అంశం కేంద్రానికి సంబంధించినది అని రాష్ట్రానిది కాదని వ్యాఖ్యానించారు. 2004లో కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మిత్రపక్షంలోనే ఉన్నారు పవార్.
2014లో మహారాష్ట్రలో పరోక్షంగా బీజేపీకి మద్ధతిచ్చారు
2014లో తొలిసారిగా శివసేన, బీజేపీ వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను మాత్రం చేరుకోలేకపోయింది. బీజేపీకి రాజకీయ శత్రువైన పవార్.. ట్రస్ట్ మోషన్ సమయంలో సభ నుండి ఎన్సీపీ ఎమ్మెల్యేలను వాకౌట్ చేయించారు. అలా మెజార్టీ సంఖ్యను తగ్గించేందుకు పరోక్షంగా సహకరించారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా అయ్యారు. ఆ తర్వాత శివసేన బీజేపీతో కలిసిపోయింది అది వేరే సంగతి.
ఈసారి కాంగ్రెస్ తో కలిసి శివసేనతో పొత్తు
2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఈసారి కూడా బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44 స్థానాలు దక్కాయి. సీఎం పదవిని రెండున్నరేళ్ల పాటు తమకు కూడా ఇవ్వాలని శివసేన పట్టుబట్టగా బీజేపీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ సమయంలోనే శరద్ పవార్ తన రాజకీయ వ్యూహాన్ని అమలు పరిచారు. కాంగ్రెస్ తో కలిసి శివసేనతో అధికారం చేపట్టారు. సీఎం కుర్చీని శివసేనకే అప్పగించి వెనకుండి చక్రం తిప్పారు. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం పదవి మాత్రమే శివసేనకు వెళ్లగా రిమోట్ కంట్రోల్ మాత్రం పవార్ చేతుల్లోనే ఉంది. సీట్ల లెక్కల్లో మూడో స్థానంలో ఉన్న పార్టీని కూడా ఆయన తన వ్యూహాలతో అధికారంలోకి తీసుకువచ్చారు.
వంద జన్మలు కావాలి
శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ శరద్ పవార్ మనస్సును అర్థం చేసుకోవడానికి వంద జన్మలు ఎత్తాలని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయాన్ని చూసిన ఎవరైనా శరద్ పవార్ కు ఇది సరిగ్గా సరిపోతుందని ఒప్పుకోవాల్సిందే. ఆయన వ్యూహాలకు ప్రతిపక్షాలు చిత్తైపోవాల్సిందే అని ఎన్నో సార్లు రుజువు చేశారు.