ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాల్సిందే, భారత్ తరపున పుతిన్ పోరాటం
UN Security Council: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.
UN Security Council:
భారత్‌కి శాశ్వత సభ్యత్వం కావాలి..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UN Security Council)లో భారత్‌కి శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin). భారత్‌తో పాటు బ్రెజిల్, సౌతాఫ్రికాకి కూడా పర్మినెంట్ మెంబర్‌షిప్ కోసం పోరాడుతున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఈ మూడు దేశాల జోక్యం పెరగాలని డిమాండ్ చేస్తున్నారు పుతిన్. ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ పవర్‌ఫుల్‌గా మారుతోందని మరోసారి ప్రశంసించారు. అలాంటి దేశాలకు కచ్చితంగా తగిన గౌరవం లభించాలని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించగలిగే సామర్థ్యం భారత్‌తో పాటు బ్రెజిల్, సౌతాఫ్రికాకి ఉందని తేల్చి చెప్పారు.
"భారత్, బ్రెజిల్, సౌతాఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. ఇలాంటి దేశాలకు అంతర్జాతీయ వ్యవహారాల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరముంది. ఆ దేశాలకు కచ్చితంగా ఆ సామర్థ్యం ఉంది. అంతర్జాతీయంగా కీలక సమస్యల్ని పరిష్కరించగలిగే సత్తా ఉంది. అందుకే...భద్రతా మండలిలో వీటికి సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాను"
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
భారత్‌లో వంద కోట్లకుపైగా జనాభా ఉందని, 7%కి మించిన ఆర్థిక వృద్ధితో దూసుకుపోతోందని వెల్లడించారు పుతిన్. ఇప్పటికే భారత్ అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదిగిందని, ఇకపైన కూడా మరింత పవర్‌ఫుల్‌గా మారుతుందని అన్నారు. నిజానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేయాల్సిన అవసరముందని ఇండియా ఎప్పటి నుంచో వాదిస్తోంది. మండలిలో శాశ్వత సభ్యత్వం పొందే హక్కు తమకు ఉందని అంటోంది. కానీ...దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మండలి. ఇటీవల ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో G20లో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదించింది భారత్. అందుకు అన్ని సభ్య దేశాలూ అంగీకరించాయి. స్వయంగా ప్రధాని మోదీ ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం లభించినట్టు ప్రకటించారు. ఇదే పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా మండలిలో భారత్‌కి పర్మినెంట్ మెంబర్‌షిప్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని పుతిన్ వాదిస్తున్నారు.
G20లో ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు శాశ్వత సభ్యత్వం కల్పించారు. సభ్యులందరి ఆమోదంతో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ చీఫ్ అజాలీ అసౌమనీని (Azali Assoumani)ఆలింగనం చేసుకున్నారు. స్వయంగా తానే పర్మినెంట్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టారు. G20 సదస్సుని ముగించే సమయంలో ఐక్యరాజ్య సమితి గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఐరాస స్థాపించినప్పటికి ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయిందని, ఈ మార్పులకు అనుగుణంగా UNలో సంస్కరణలు చేయాల్సిన అవసరముందని సూచించారు.
"ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు ప్రపంచం వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పట్లో కేవలం 51 దేశాలకే సభ్యత్వం ఉండేది. ఇప్పుడా సంఖ్య 200కి చేరుకుంది. కానీ శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్యలో మాత్రం మార్పు రాలేదు. అప్పటికి ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయింది. ఇప్పటికి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాల్సిన అవసరముంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: కెనడాలో ఘోర విమాన ప్రమాదం, ఇద్దరు భారతీయ పైలట్‌లు మృతి