Maharashtra elections: మహారాష్ట్ర అసెంబ్లీ అభ్యర్థుల్లో పరాగ్ షా రిచ్చెస్ట్ - ఆయన చేసే వ్యాపారాలేంటో తెలుసా ?
Parag shah: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. బీజేపీ టిక్కెట్ ఇచ్చిన ఓ అభ్యర్థి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Richest candidate in the Maharashtra assembly election : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తయింది. అభ్యర్థులు అంతా తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. వారిలో అత్యధిక సంపన్నుడిగా పరాగ్ షా నిలిచారు. ఆయన ముంబైలోని ఘట్కోపర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఆయనకు టిక్కెట్ ఇవ్వాలా వద్దా అలోచించి.. చివరికి ఆయన మనీ పవర్ అయినా గట్టెక్కిస్తుందన్న ఉద్దేశంతో ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను మొత్తం రూ. 3,383 కోట్లుగా పేర్కొన్నారు.
పరాగ్ షా ముంబైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. అందుకే ఆయన ఆస్తుల్లో అత్యధికం చరాస్తులే. స్థిరాస్తుల్ని అతి తక్కువగా చూపించారు. తన మొత్తం ఆస్తుల్లో రూ. 3,315 కోట్లను చరాస్తులుగా చెప్పారు. మిగతా 67 కోట్లు మాత్రమే స్థిరాస్తులు. పరాగ్ షా గత ఎన్నికల్లోనూ ఘట్కోపర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు కూడా ఆయన నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆ అఫిడవిట్ ప్రకారం ఐదేళ్ల కిందట ఆయన స్థిర, చరాస్తులు కేవలం 550 కోట్ల రూపాయలు మాత్రమే. ఐదేళ్లలో ఆయన సంపద ఐదు వందల శాతానికిపైగా పెరిగిపోయి రూ. 3,383 కోట్లుకు చేరుకుంది. అంటే ఐదేళ్లోనే ఆయన ఊహించనంత భారీగా సంపాదించారన్నమాట.
అణుదాడికి రెడీ అవుతున్న రష్యా - ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపైనే మొదటి గురి !
దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో రాజకీయ నేతలు అత్యంత ధనవంతులే అవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వందల కోట్ల ఆస్తులు ఉంటాయి. నిజానికి ఎన్నికల అఫిడవిట్‌లో చూపించే దానికి వారి నిజమైన ఆస్తులకు పోలికే ఉండదు. కానీ అధికారికంగా తమ ఆస్తుల్ని డిక్లేర్ చేశారు కాబట్టి అదే వారి ఆస్తి అని అనుకోవాలి. బినామీ ఆస్తులు మాత్రమే కాదు..కొన్ని కుటుంబసభ్యుల ఆస్తులను కూడా దాచి పెట్టే నేతలు ఉంటారు. అయితే వివాదం రాకుండా చుసుకుంటూ ఉంటారు. లేకపోతే కోర్టుల్లో ప్రత్యర్థులు పిటిషన్లు వేస్తే.. ఆస్తుల్ని దాచి పెట్టినట్లుగా తేలితే అనర్హతా వేటు పడుతుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను దాదాపు 8 వేల మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా 29న ముగిసింది. నాసిక్ జిల్లాలో అత్యధికంగా 361 మంది అభ్యర్థులు 506 నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఇరవై మూడో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. రెండు కూటములుగా మారి ఆరు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.