Telangana New CM Revanth: జై సోనియమ్మ, జై కాంగ్రెస్ - సోషల్ మీడియాలో కొత్త సీఎంపై ట్రోలింగ్
Revanth Reddy: రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా జై తెలంగాణ అనే పదం వాడలేదని.. ఆ మాట కూడా అని ఉంటే బాగుండేదని అంటున్నారు.
Trolling On Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డిపై అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అయితే ఆ ట్రోల్ చేస్తున్న హ్యాండిల్స్ అన్నీ బీఆర్ఎస్ సానుభూతిపరులవే కావడం విశేషం. సరిగ్గా ప్రమాణ స్వీకారం రోజే వారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్రమాణ స్వీకార సభలో రేవంత్ ప్రసంగంపై కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..?
LIVE : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ప్రమాణస్వీకారం
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2023 తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. జై సోనియమ్మ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి. ప్రసంగం చివరిలో కూడా ఆయన జై సోనియమ్మ అని నినదించారు. జై సోనియమ్మ, జై కాంగ్రెస్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారాయన. ఇక్కడే తెలంగాణ వాదులు తమ విమర్శలకు పదును పెట్టారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా జై తెలంగాణ అనే పదం వాడలేదని.. ఆ మాట కూడా అని ఉంటే బాగుండేదని అంటున్నారు. జై తెలంగాణ అనకపోగా.. జై కాంగ్రెస్, జై సోనియమ్మ అంటూ తన పార్టీ నినాదాలు చేశారని.. కనీసం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజయినా, ఆ సభలో అయినా జై తెలంగాణ అని ఉంటే బాగుండేదని అంటున్నారు నెటిజన్లు.
https://t.co/xZAkFiESF1
అయితే ఈ విమర్శలు కేవలం బీఆర్ఎస్ అనుకూల ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి మాత్రమే బయటకొచ్చాయి. కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలెవరైనా కానీ.. తమ ప్రసంగాల్లో జై తెలంగాణ అనే నినాదాలు చేస్తారు. తాజా ఎన్నికల ప్రచారంలో కూడా నేతలంతా తమ ప్రసంగాల్లో ఒకటికి నాలుగు సార్లు జై తెలంగాణ అనేవారు. మరి రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన తొలి ప్రసంగంలో జై సోనియమ్మ అంటూ ముక్తాయించడం విశేషం.
సోనియా విధేయుడిగా..
ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో.. సోనియాగాంధీకి విధేయుడిగానే మసలుకున్నారు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఉన్న స్టేజ్ పైకి వచ్చేందుకు కూడా సోనియా గాంధీతో కలసి ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేసుకుంటూ వచ్చారు. స్టేడియంలో ఉన్నవాదంరికీ వారిద్దరూ అభివాదం చేశారు. ఇక స్టేజ్ పై సోనియాగాంధీ కూర్చునే వరకు.. రేవంత్ రెడ్డి ఓ సాధారణ కాంగ్రెస్ నాయకుడిలాగే హడావిడి చేశారు. స్టేజ్ పై అడ్డుగా ఉన్నవారిని పక్కకు వెళ్లాలని చెప్పడం, కెమెరామెన్లను పక్కకు రావాలని సూచించడం.. ఇలా ఆయన సోనియా స్టేజ్ పై కూర్చునే వరకు ఆమె వద్దే ఉన్నారు. రాహుల్, ప్రియాంకతో కలసి సోనియా స్టేజ్ నుంచి దిగి వెళ్లిపోయే సమయంలో కూడా రేవంత్ రెడ్డి కారు వరకు వెళ్లి ఆమెను సాగనంపి వచ్చారు. అగ్రనేతలంతా వెళ్లిపోయిన తర్వాతే తన ప్రసంగాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి.
తనను నమ్మి పీసీసీ పీఠాన్ని ఇవ్వడంతోపాటు.. సీఎం కుర్చీకి పోటీ ఉన్నా కూడా తనకే అప్పగించినందుకు రేవంత్ రెడ్డి.. గాంధీ కుటుంబానికి తన విధేయతను చూపుతున్నారు. తన ప్రసంగంలో కూడా పదే పదే సోనియా, రాహుల్, ప్రియాంక పేర్లను ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. దాదాపుగా కాంగ్రెస్ లో నాయకులంతా అధిష్టానానికి విధేయులుగానే ఉంటారు. ఎక్కడ ఎవరు కాస్త తలెగరేసినా అధిష్టానం వారిని అణచి వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఢిల్లీ అండదండలుంటేనే కాంగ్రెస్ లో పదవులు లభిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు పూర్తిగా అధిష్టానం మనిషిగానే ఉన్నారు. అదే ఇమేజ్ ని ఆయన కొనసాగించే అవకాశముంది.