Rashtrapati Bhavan: ఏసీబీ కోర్టు జడ్జిపై అసభ్య పోస్టులు, రాష్ట్రపతి భవన్ సీరియస్
Rashtrapati Bhavan: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన జడ్జిపై అసభ్య పోస్టులు పెడుతున్నారు. దీనిపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియా లో విమర్శలు చేశారు.
Rashtrapati Bhavan: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కించింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలతో రాజకీయాలను వేడిక్కిస్తున్నాయి. 300 కోట్ల రూపాయలకుపైగా పక్కదారి పట్టించారన్న అభియోగాలతో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అవినీతి నిరోధక శాఖ కోర్టు జడ్జి అయిన హిమబిందు చంద్రబాబుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈ మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విధితమే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటి నుంచి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు దర్శనమిస్తున్నాయి.
చంద్రబాబును జైలుకు పంపించారన్న ఆగ్రహంతో.. జడ్జి హిమబిందును కించపరుస్తూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఆమెను కించపరుస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఆ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదు దారుడికి వివరించాలని సదరు లేఖలో పేర్కొన్నారు.