Ashok Gehlot: 'ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుంటాం.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు మాదే'
పంజాబ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. రాజస్థాన్‌లో తాము ఐదేళ్ల పాలన పూర్తిచేసుకుంటామని గహ్లోత్ ధీమా వ్యక్తం చేశారు.
రాజస్థాన్‌లో గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ల మధ్య నాయకత్వ పోరు ఎప్పటినుంచో కొనసాగుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌లోనూ సీఎం మార్పుపై విస్తృత చర్చ సాగుతోంది. భూపేష్ బఘేల్ రెండున్నరేళ్లుగా సీఎం పదవిలో ఉన్నారు. అయితే ముందస్తు ఒప్పందం ప్రకారం, ఇప్పుడు ఆ పదవి తనకు ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి టి.ఎస్.సింగ్‌దేవ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ రాజకీయ పరిణామాలపై బఘేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఛత్తీస్‌గఢ్ ఎప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లానే ఉంటుంది తప్ప, పంజాబ్ మాత్రం కాబోదని ఆయన అన్నారు. ఆయనకు మద్దతు ఇస్తున్న పలువురు శాసనసభ్యులు మూడు రోజులుగా దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పరిణామంపై బఘేల్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేల దిల్లీ పర్యటనను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు.
పంజాబ్‌లో..
ఇటీవల పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎంగా అమరీందర్ సింగ్ రాజీనామా, పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. అనంతరం పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు పంజాబ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్.. ఈ పరిణామాలతో అయోమయంలో పడింది. రాబోయే ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: Mumbai Rave Party: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు.. వైద్య పరీక్షలకు తరలింపు!