Punjab Congress Crisis: 'కాంగ్రెస్ దీన స్థితిలో ఉంది.. ఆ ఆరోపణలు బాధాకరం'
తనపై కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ దీన స్థితిలో ఉందన్నారు.
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రస్తుతం దీన స్థితిలో ఉందని అమరీందర్ అన్నారు. పార్టీలో మొదలైన అంతర్యుద్ధాన్ని పార్టీ అధిష్ఠానం సరైన రీతిలో హ్యాండిల్ చేయకలేకపోయిందని అమరీందర్ అన్నారు.
అమరీందర్ సింగ్ రాజీనామా కోరుతూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి 78 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారని రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఇటీవల తెలిపారు. ఆ వ్యాఖ్యలను మరసటి రోజే అమరీందర్ సింగ్ ఖండించారు. తన రాజీనామా నిర్ణయంలో ఎవరి ఒత్తిడి లేదని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అమరీందర్ సింగ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ సీఎం తాను భాజపాలో చేరడం లేదని వెల్లడించారు. అలాగని కాంగ్రెస్‌లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఆయన కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోది. వచ్చే 15 రోజుల్లో నూతన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని అమరీందర్‌సింగ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై ఇప్పటికే తన మద్దతుదారులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వెనక్కి తగ్గిన సిద్ధూ..
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. సిద్ధూను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన చర్చలు ఫలించినట్లే తెలుస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. సిద్ధూతో ఇటీవల చర్చలు జరిపారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు సిద్ధూ ఇప్పటివరకు ప్రకటించలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం చర్చలు జరుపుతోంది.
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..