ఈ జిల్లాల్లో ఉన్న వాళ్లు కాస్త జాగ్రత్త- పిడుగుల వాన పడొచ్చు
ద్రోణుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ద్రోణులు, ఆవర్తనల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలు మరో మూడు రోజులు కురవడం ఖాయమంటున్నారు భారత వాతావరణ విభాగం అధికారులు. రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. ఇది పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఛత్తీస్‌గఢ్ ఒడిశా వరకు ఉంది. బంగ్లాదేశ్‌కు ఆనుకొని ఏర్పడిన మరో ద్రోణి కూడా బలహీన పడింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 17, 2023
ఈ ద్రోణుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలోని త్రిపురాంతకం కోటలో 7.3 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగలలో 5 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లాలోని రేపల్లెలో 4.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యాయి.
తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో వాతావరణ స్థితి
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.
ఏపీలో వర్షాలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.
ఢిల్లీలోని భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఉత్తర భారతదేశంలోని వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది సమయానికి ముందే ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతల బలమైన ప్రభావం కనిపించింది. తాజాగా పాకిస్తాన్‌లో ఏర్పడిన తుపాను ప్రసరణ కారణంగా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మార్చి నెలలోనే వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
THIS SHOWS THE WEATHER ACTIVITY OVER Jn K, Himachal Pradesh, Uttarakhand, west Uttar Pradesh, Madhya Pradesh, northern parts of Punjab and Haryana, Telangana, Chhattisgarh, Odisha and Assam & Meghalaya. pic.twitter.com/CKZeTs318E
— India Meteorological Department (@Indiametdept) March 18, 2023