Queen Elizabeth II: ఇండియాకు సారీ చెప్పిన క్వీన్ ఎలిజబెత్, ఎందుకంటే?
Queen Elizabeth II: జలియన్ వాలాబాగ్ ఘటనతో చలించిన క్వీన్ ఎలిజబెత్ భారత్‌కు సారీ చెప్పారు.
Queen Elizabeth II:
"చరిత్రను తిరగరాయలేం. అలా అని ఇందులో దాచాల్సిందేం లేదు. బ్రిటీషర్లుగా గతంలో ఎన్నో తప్పులు చేశాం. చాలా కష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నాం. చరిత్రలో ఎన్నో బాధాకరమైన రోజులు ఉన్నాయి. అలానే మంచిరోజులు ఉన్నాయి. బాధ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాం. మంచి రోజులతో మరింత ఎదిగాం " ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ ఎలిజబెత్ మహారాణి నోటి నుంచి వచ్చిన మాటలు.
స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథి :
1997లో భారత్ స్వత్రంత్రం సాధించి స్వర్ణోత్సవాలు సాధించుకుంటున్న వేళ బ్రిటీష్ మహారాణి ఎలిజబెత్ 2 భారత్ కు వచ్చారు. అప్పుడు భారత్ కు ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా క్వీన్ ఎలిజబెత్ 2 తను జలియన్ వాలా బాగ్ లో పర్యటించాలని కోరుకున్నట్లు ప్రకటించారు. ఇక అంతే భారత్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఎవరి నుంచి స్వతంత్రం సంపాదించుకుని స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నామో...ఆ దేశ అధినేతల్నే ముఖ్య అతిథులుగా వేడుకలకు పిలవటం తప్పైతే ఇప్పుడు జలియన్ వాలాబాగ్ లో ఎలిజబెత్ సభ ఏర్పాటు చేయటం ఏంటని పెద్ద ఎత్తున మన దేశ ప్రజలు ఆందోళనలకు దిగారు.
ఎలిజబెత్ చర్యలకు ఆశ్చర్యపోయిన భారత్ :
క్వీన్ ఎలిజబెత్ 2 మాత్రం అందరూ ఆశ్చర్య పోయే విధంగా పశ్చాత్తాప ధోరణిని ప్రదర్శించారు. 1919 లో జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో జనరల్ డయ్యర్ ఆదేశాలతో బ్రిటీష్ సైన్యం సామాన్యపౌరులపై దారుణాతిదారుణంగా కాల్పులు జరిపింది. 1500 మంది వరకూ నాటి మారణకాండలో తుపాకీ గుళ్లకు బలైపోయారు. మరో 1200 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాటి ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత రగిల్చి...స్వేచ్ఛావాయువులు పీల్చుకునే వరకూ తీసుకెళ్లింది. అలాంటి ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్మృతి వనానికి యూకే సామ్రాజ్ఞి హోదాలోనే వెళ్లారు క్వీన్ ఎలిజబెత్ 2.
విచక్షణాధికారాలతోనే నిర్ణయం :
కాలికి ఉన్న చెప్పులను తొలగించి మెమోరియల్ లో కాలినడకన వెళ్లారు ఎలిజబెత్ 2. కాషాయవస్త్రాలు ధరించి తన చేతుల్లో ఉన్న పుష్పగుచ్ఛాలను నాటి అమరవీరుల స్మృతి చిహ్నాల ముందు ఉంచారు. ఆ తర్వాత మౌనాన్ని పాటించారు. వాస్తవానికి బ్రిటన్ రాణి పర్యటనలో జలియన్ వాలాబాగ్ లో ఆమె ఏం చేయాలనే అంశాలు అధికారికంగా లేకపోయినా..తనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి క్వీన్ ఎలిజబెత్ భారతీయులకు క్షమాపణలు చెప్పేందుకు ఇలా చేశారని విశ్లేషకులు చెబుతుంటారు.
జలియన్ వాలాబాగ్ ఘటన సహా బ్రిటీష్ చరిత్రలో జరిగిన అనేక తప్పులకు బాధ్యత తీసుకుంటామని క్వీన్ ఎలిజబెత్ చేసిన ప్రసంగం.....నాటి మన త్యాగవీరులకు ఆత్మశాంతి చేకూర్చి ఉంటుందని దేశవ్యాప్తంగా వార్తలు ప్రసారమయ్యాయి. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ చేసిన ఈ చర్యలపై యూకే బకింగ్ హామ్ ప్యాలెస్ ఏ విధంగా స్పందించిందో తెలియదు కానీ 2013 లో బ్రిటన్ ప్రధానిగా జలియన్ వాలాబాగ్ కు వచ్చిన డేవిడ్ కేమరూన్...స్వర్ణోత్సవాల వేళ మహారాణి ఎలిజబెత్ చేసిన ప్రసంగాన్ని తలచుకున్నారు. బ్రిటీష్ చరిత్రలోనే సిగ్గు తో తలదించుకోవాల్సిన సందర్భంగా జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను డేవిడ్ కామెరూన్ ఒప్పుకోవటంతో భారతీయుల పట్ల క్వీన్ ఎలిజబెత్ చాటుకున్న సహృద్భావం, ఆమె చూపించిన పశ్చాత్తాపం చర్చకు వచ్చాయి.
Also Read: క్వీన్ ఎలిజబెత్‌కు నిజాం డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన నిజాం, ధరెంతో తెలుసా?