![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Presidential election 2022: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఉద్దవ్ ఠాక్రే, మళ్లీ భాజపాకు దగ్గరవుతున్నారా?
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతున్నట్టు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. భాజపాకు మళ్లీ దగ్గరవుతున్నారా అన్న సంకేతాలిచ్చారు.
![Presidential election 2022: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఉద్దవ్ ఠాక్రే, మళ్లీ భాజపాకు దగ్గరవుతున్నారా? Presidential election 2022 Shiv Sena To Support Droupadi Murmu Open Door And Signal from Thackeray to BJP Presidential election 2022: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఉద్దవ్ ఠాక్రే, మళ్లీ భాజపాకు దగ్గరవుతున్నారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/9e3811bae4fd793c8900ea72350ec78f1657693536_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ద్రౌపది ముర్ముకి ఫుల్ సపోర్ట్: ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో నెల రోజుల్లోనే ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే సీఎం అయ్యారు. దేవేంద్ర ఫడణవీస్
ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీనంతటికీ కారణం భాజపాయేనని కారాలు మిరియాలు నూరిన శివసేన ఉన్నట్టుండి ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే స్వయంగా ఇది వెల్లడించటమే ఆశ్చర్యం కలిగించిన విషయం. గిరిజన వర్గానికి చెందిన మహిళను నిలబెట్టటం పట్ల గౌరవమిస్తూ, ఆమెకు పూర్తి మద్దతునిస్తామని స్పష్టం చేశారు ఠాక్రే. భాజపా, శివసేన మధ్య పరోక్ష యుద్ధం నడుస్తున్న సమయంలో ఠాక్రే ప్రకటన..విస్మయం కలిగించేదే. తప్పని పరిస్థితుల్లోనే ఆయన ఇలా సపోర్ట్ చేస్తున్నట్టు వెల్లడించారన్న వాదనలున్నాయి. అయితే తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టంగానే చెప్పారు. "గిరిజన వర్గానికి చెందిన ఓ వ్యక్తిని మొదటిసారి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారని, ఆమెకు మద్దతు తెలపటం మంచిదని..పార్టీ ట్రైబల్ లీడర్స్ చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని తెలిపారు ఠాక్రే.
మళ్లీ భాజపాకు దగ్గరవుతున్నారా..?
"వాస్తవానికైతే ప్రస్తుత పరిస్థితుల్లో నేనీ నిర్ణయం తీసుకోకూడదు. కానీ మా ఆలోచనలు మరీ అంత సంకుచితంగా ఉండవు" అని కామెంట్ చేశారు ఉద్దవ్ ఠాక్రే. ఈ ప్రకటన చేయటం వెనక రాజకీయ కోణమూ ఉంది. మహారాష్ట్రలో దాదాపు 10% మంది ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వారున్నారు. వారంతా శివసేనకు ఎప్పటి నుంచో ఓట్ బ్యాంక్‌గా ఉన్నారు. వీరి మద్దతు పోకుండా చూసుకోవాలంటే...తప్పనిసరిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకి సపోర్ట్ ఇవ్వాల్సిందే. అందుకే అలా డిసైడ్ చేశారు ఠాక్రే. ఇక్కడే మరో అంశమూ కీలకంగా చర్చకు వస్తోంది. మళ్లీ ఉద్దవ్ ఠాక్రే, భాజపాతో మైత్రికి ప్రయత్నిస్తున్నారా అన్న సందేహమూ తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలువురు శివసేన నేతలు..ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని భాజపాకు దగ్గరవ్వాలని సూచించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో ఠాక్రే ఆ సూచనలు పట్టించుకోలేదు. ఇప్పుడు ద్రౌపది ముర్ముకి మద్దతు తెలుపుతూ, పరోక్షంగా భాజపాకు సానుకూల సంకేతాలు పంపుతున్నారన్నది కొందరి విశ్లేషణ. శివసేనకు మొత్తం 22 మంది ఎంపీలున్నారు. వారిలో 6గురు ఇప్పటికే శిందే వైపు వెళ్లిపోయారు. ఉన్న 16 మంది ఎంపీలు కూడా భాజపాకు దగ్గరవ్వాలని ఠాక్రేకు వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎంపీల విజ్ఞప్తి మేరకు, ముర్ముకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారని సమాచారం. కారణమేదైనా, మళ్లీ భాజపా, శివసేన దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)