Liquor prices: మందుబాబులకు షాక్! పెరిగిన మద్యం ధరలు - దేశంలోనే అక్కడ కాస్ట్ లీ లిక్కర్ సేల్
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చింది. ఎక్పైజ్ సుంకాన్ని 20 శాతం పెంచింది. దీంతో ఎక్కువ ధరకు మందు దొరికే రాష్ట్రంగా కర్ణాటక నంబర్.1 గా నిలిచింది.
Liquor prices: మందుబాబులకు కర్ణాటక సర్కార్ తేరుకోలేని షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య గత శుక్రవారం కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (AED) 20% పెంచాలని ప్రతిపాదించారు. దీంతో తాజాగా పెరిగిన మద్యం ధరలు జులై 19 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే తాజాగా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 20 శాతం పెరగడంతో దేశంలోనే మద్యం ఎక్కువ ధరకు విక్రయించే రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలోకి వచ్చింది. బీర్ల అమ్మకాల్లో మూడో స్థానంలో నిలిచింది.
దేశీయ లిక్కర్(క్రూడ్ కంట్రీ లిక్కర్ వేరియంట్) అయిన అరక్ అమ్మకాలను చాలా కాలంగా కర్ణాటకలో నిషేధించినందున..దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్‌లు కర్ణాటకలో ఇప్పటికీ తక్కువ ధర ఉన్నాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, స్థానిక మద్యం బ్రాండ్ల ధరలను తగ్గించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను టిప్పలర్లు కోరారు. పేద కార్మికులు వినియోగించే మద్యం బ్రాండ్ల ధరలను తగ్గించాలని టిప్పర్ల ఫోరమ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరింది.
తక్కువ ధర మద్యం బ్రాండ్లు కూడా ఖరీదే..
పెరిగిన మద్యం ధరల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్లు కూడా కర్ణాటకలో అధిక ధర ఉన్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ స్లాబ్‌లో ఉన్న మద్యం ( బల్క్‌లో లీటర్ మద్యం ధర రూ. 449 ) ధర మినహా మిగిలిన బ్రాండ్లు అన్ని కర్ణాటకలోనే అధికంగా ఉన్నట్లు కర్ణాటక బ్రేవరీస్ అండ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ పార్సా వెల్లడించారు. ఇది నిజంగా అన్ని రకాల మద్యం వినియోగదారులకు ఇబ్బంది కలిగించే అంశమని ఆయన తెలిపారు. కర్ణాటకలో మద్యం వినియోగదారుల్లో 78 శాతం కన్నా ఎక్కువ మంది తక్కువ మరియు మధ్యస్థ స్లాబ్‌లలో ఉన్న మద్యాన్నే తీసుకుంటారని.. కేవలం 5 శాతం మంది మాత్రమే పెద్ద బ్రాండ్ల మద్యాన్ని సేవిస్తారని..ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధరల పెంపు అనేది కొంత మంది మద్యం ప్రియులపై మాత్రమే ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై కొన్ని రోజుల తర్వాత సీఎం సిద్ధరామయ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
బీర్ల ధరల్లో మూడవ స్థానం..
బీర్ల విషయానికి వస్తే దేశంలోనే అత్యధిక రేటులో అమ్మకాలు జరుపుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడవ స్థానంలో నిలిచింది. బీర్‌పై ఏఈడీని రూ.175 నుంచి 185కి పెంచాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఫలితంగా జూలై19 నుంచి 650 ఎంఎల్ బీర్ బాటిల్ ధర రూ.170 నుంచి రూ.187కి పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటకలో బీరు ధర రూ. 187 ఉంది. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడులో అత్యధికంగా రూ. 210, ఢిల్లీలో రూ. 190 ఉన్నాయి. పెరుగిన మద్యం ధరలపై ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI) సుంకాన్ని తగ్గించాలని, ప్రీమియం బ్రాండ్‌ల ఎంఆర్పీని పొరుగు రాష్ట్రాలకు అనుగుణంగా తగ్గించాలని రాష్ట్రాన్ని కోరింది.