AP Pensions : ఏపీలో సామాజిక పెన్షన్లు తగ్గించేస్తున్నారా..? అసలు నిజమేంటి..?
ఏపీలో నెలకు యాభై వేల వరకూ సామాజిక పెన్షన్ లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతోంది. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అనర్హులకు ఇవ్వాలా అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సామాజిక పెన్షన్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. లబ్దిదారులను తగ్గించేస్తున్నారంటూ విపక్షాలు ప్రభుత్వంపై మండి పడుతున్నాయి. పలు చోట్ల తమ పెన్షన్ తొలగించారంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరో వైపు పెన్షన్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అనర్హులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలతో సామాజిక పెన్షన్ల చుట్టూ రాజకీయం మరింత ముదురుతోంది.
"సామాజిక పెన్షన్" కీలకమైన సంక్షేమ పథకం
సామాజిక పెన్షన్లు తెలుగు రాష్ట్రాల‌్లో అత్యంత కీలకమైన సంక్షేమ పథకం.రాష్ట్ర విభజనకు ముందు రూ. రెండు వందలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు వృద్ధులకు ఈ పెన్షన్ పథకం కింద అందుతున్నది రూ. 2250. గతంలో 65 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేవారు. రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నిక సమయంలోనూ ఈ వాయసు తగ్గించుకుంటూ వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగా 60 ఏళ్లకు పెన్షన్ వయసు తగ్గించారు. ఇప్పుడు ఏపీలో 60 ఏళ్లు దాటిన నిరుపేదలకు పెన్షన్ అందుతోంది. అలాగే ఒంటరి మహిళలు, కళాకారులు, కిడ్నీ పేషంట్లు, వికలాంగులు ఇలా పలురకాల విభాగాల కింద కూడా పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకు రూ.3 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ రోగులకు రూ.10 వేలు ఇస్తున్నారు.
Also Read : తహశీల్దార్లపై కలెక్టర్ తిట్ల పురాణం
60 లక్షల మంది లబ్దిదారులు..!
సామాజిక పెన్షన్లు దాదాపుగా ఏ ఆధారం లేని వారికే ఇస్తారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు.. ఇలాంటి కారణంగా వారు అధికార పార్టీకే సానుకూలంగా ఉంటారు. ఠంచన్‌గా పింఛన్ ఇచ్చే పార్టీకి వారు కృతజ్ఞతగా ఉంటారు. వీరి సంఖ్య కూడా ఏమీ తక్కువ కాదు. 60 లక్షల వరకూ సగటున ఉంటోంది. వీరిలో ఎనభై శాతాన్ని ఓటు బ్యాంక్‌గా మార్చుకునేలా సేవలు అందించినా ఏ ఎన్నికల్లో అయినా గెలుపు నల్లేరుపై నడక అవుతుంది. అందుకే రాజకీయ పార్టీలు ఈ పెన్షన్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తూంటాయి. సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేకత చాటుకుంటున్న ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకం అమలుకు జాగ్రత్తలు తీసుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీనే పెన్షన్ వారి ఇంటికి వెళ్లి ఇచ్చేలా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే అసమయంలో పెన్షన్ల వయసు 60కి తగ్గించడంతో పెద్ద ఎత్తున లబ్దిదారులు పెరిగారు. వారందరికీ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కిందటి వరకూ అంతా సాఫీగానే నడిచింది. కానీ కొంత కాలం నుంచి ప్రభుత్వం అనేక నిబంధనలు అమలు చేస్తూండటంతో లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.
Also Read : టోల్ కట్టమన్నారని ఐఏఎస్ అధికారి చిందులు
లబ్దిదారులను ప్రతి నెలా యాభై వేల వరకూ తగ్గిస్తున్న ఏపీ ప్రభుత్వం..!
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రతి నెలా యాభై వేల వరకూ సామాజిక పెన్షన్ల లబ్దిదారులు తగ్గిపోతున్నారు. జూన్ నెలలో గరిష్టం 61 లక్షల 46వేల మందికి పెన్షన్ పంపిణీ చేశారు. జూలై నెలలో ఈ సంఖ్య 60 లక్షల95 వేల మందికి తగ్గిపోయింది. ఆ తర్వాత నెల అంటే ఆగస్టులో 60 లక్షల 50వేల మందికే పంపిణీ చేశారు. ఈ నెల పెన్షన్లకు అర్హుల సంఖ్య 59 లక్షల 18వేలుగా మాత్రమే గుర్తించారు. అంటే నెలకు యాభై వేల మందిని చొప్పున అనర్హుల్ని చేస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం వివిద రకాల నిబంధనలను అమలు చేయాలని వాలంటీర్లను ఆదేశించింది. ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్ తరహాలో పలు నిబంధనలు తీసుకు రావడంతో ఇప్పటి వరకూ పెన్షన్ తీసుకున్న వారందరూ అనర్హులవుతున్నారు. దీంతో అనేక మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
అనర్హులకు ఇవ్వాలా అని ప్రశ్నిస్తున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల..!
పెన్షన్ల అంశం రాజకీయవివాదంగా మారడంతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటూ ఏపీలో పెన్షన్లు తీసుకుంటారా అని ప్రశ్నించారు. అనర్హులను ఏరి వేస్తున్నామని.. అక్రమాలను అరికట్టేందుకే ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాలని.. లేకపోతే ఇచ్చేది లేదన్న నిబంధన తెచ్చామని అంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం గతంలో ముంబైకి.. బెంగళూరుకు వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు ఇచ్చిన విషయాన్ని వైసీపీ ప్రచారం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పుడు వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు రాజకీయ కారణాలతోనూ కొంత మంది పెన్షన్లు నిలిపివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ వృద్ధుల్లో.. సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్లో ఆందోళన ప్రారంభమయింది.
Also Read : "ఉమ్మి" వివాదంలో పురందేశ్వరి
ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందా.!?
ఏపీ ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వానికి జీతాలివ్వడమే కష్టంగా ఉంటోంది. ఇలాంటి సమయంలో భారాన్ని తగ్గించుకునేందుకు లబ్దిదారుల్ని ఏరి వేస్తున్నారన్న ఆరోపణలు సహజంగానే వస్తూంటాయి. పైగా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పెన్షన్లు రూ. మూడు వేల వరకూ పెంచుకుంటూ పోతామన్నారు. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ప్రతీ ఏడాది రూ. 250 పెంచుతామన్నారు. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క సారే పెంచారు. వచ్చే జనవరి నుంచి పెంచుతామని సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించారు. రూ. 250 పెంచాలంటే ప్రభుత్వం వద్ద నిధులు సరిపోవు. అందుకే లబ్దిదారులను తగ్గించి ఆ మిగిలిన వాటితో ఇతరులకు పెన్షన్ పెంచుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా ఈ పథకం లబ్దిదారులు అయితే తగ్గిపోతున్నారు. అందుకే రాజకీయంగానూ దుమారం రేగుతోంది.