(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Swearing: ప్రధాని పదవికి మోదీ రాజీనామా, ఆమోదించిన రాష్ట్రపతి - 8వ తేదీన ప్రమాణ స్వీకారం
PM Modi: నరేంద్ర మోదీ జూన్ 8 వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
PM Modi: ఈ నెల 8వ తేదీన నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వరుసగా మూడోసారి ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఇక్కడ నిర్ణయించారు. ఆ తరవాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మోదీ రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ మేరకు రాష్ట్రపతి మోదీ రాజీనామాని ఆమోదించారు. ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు. ప్రధాని మోదీ నివాసంలో NDA నేతలు సమావేశం కానున్నారు. ఆ తరవాత కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతగా 241 చోట్ల విజయం సాధించగా NDA కూటమి 294 స్థానాల్లో గెలిచింది.
ఈ క్రమంలోనే మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సమాలోచనలు సాగిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మోదీ నివాసంలో కీలక భేటీ జరగనుంది. ఆ తరవాతే తదుపరి కార్యచరణ ప్రకటించే అవకాశాలున్నాయి. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి జవహర్ లాల్ నెహ్రూ రికార్డుని సమం చేయనున్నారు. 1962 తరవాత వరసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న నేతగానూ మోదీ రికార్డు సృష్టించనున్నారు. 1947 నుంచి 1964 వరకూ వరసగా మూడు సార్లు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాల 286 రోజుల పాటు ఈ పదవిలో ఉన్నారు.
వారణాసిలో ఎంపీగా పోటీ చేసిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై లక్షన్నర ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరసగా మూడోసారి ఇక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ సొంతగా 370 సీట్లు గెలుచుకోవాలన్న భారీ లక్ష్యం పెట్టుకుంది. మోదీ కూడా పదేపదే ఇదే ప్రచారం చేశారు కూడా. అయితే...యూపీ ఓటర్లు ఇచ్చిన షాక్‌తో పాటు ఇండీ కూటమి పుంజుకోవడం వల్ల ఆ సంఖ్య పడిపోయింది. 241 స్థానాలకే పరిమితమైంది. కూటమితో కలిసి మొత్తంగా 294 స్థానాలు గెలుచుకుంది. ఈ క్రమంలోనే NDA కీలక నేతలతో మోదీ సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకి ఎలాంటి సవాళ్లు ఎదురుకాకుండా జాగ్రత్త పడుతున్నారు. వీలైనంత ఎక్కువ మందిని తమతో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.