Article 370 Abrogation: ఆర్టికల్ 370 రద్దుపై 'సుప్రీం' తీర్పు - చారిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ హర్షం
PM Modi: 'ఆర్టికల్ 370' రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, అభివృద్ధిని ప్రతిధ్వనించే తీర్పని కొనియాడారు.
PM Modi Response on SC Verdict on Article 370: జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 'ఆర్టికల్ 370' (Article 370) రద్దుపై కేంద్రం నిర్ణయం సరైనదేనన్న సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం ఓ చారిత్రకమని, ఇది ప్రజల ఐక్యత, ఆశలు, అభివృద్ధిని ప్రతిధ్వనించే చారిత్రాత్మక తీర్పని ప్రశంసించారు.
మోదీ ఏమన్నారంటే.?
'ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. 2019, ఆగస్ట్ 5న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధమేనని సమర్థించింది. జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రజల ఆశ, పురోగతి, ఐక్యతకు ఇది అద్భుతమైన ప్రకటన. భారతీయులుగా మనం ఎంతో గర్వపడే ఐక్యతను సర్వోన్నత న్యాయస్థానం మరోసారి బలపర్చింది. అక్కడి ప్రజల కలలు నెరవేర్చడానికి మేం కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి ఫలాలు జమ్మూకశ్మీర్ ప్రజలకు చేరడమే కాకుండా, ఆర్టికల్ 370 వల్ల నష్టపోయిన అత్యంత బలహీన, అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందిస్తాం. ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైనదే కాదు. ఇది భవిష్యత్ తరాలకు ఓ ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్ధానం. బలమైన, మరింత ఐక్యతాయుత భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పానికి ఈ తీర్పు నిదర్శనం.' అని ప్రధాని పేర్కొన్నారు.
Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and…
— Narendra Modi (@narendramodi) December 11, 2023
అమిత్ షా హర్షం
'ఆర్టికల్ 370' రద్దు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. 'ఆర్టికల్ 370ను తొలగించిన తర్వాత పేదలు, అణగారిన వర్గాల ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుంది. దేశ ఐక్యత, సమగ్రత నేడు మరింత బలపడింది. వేర్పాటువాదం, రాళ్లు రువ్వే ఘటనలు ఇక గతమే. స్థానిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం, అత్యాధునిక విద్యా మౌలిక సదుపాయాలు కల్పించడం, పేదలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.' అని అమిత్ షా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
After the abrogation of #Article370, the rights of the poor and deprived have been restored, and separatism and stone pelting are now things of the past. The entire region now echoes with melodious music and cultural tourism. The bonds of unity have strengthened, and integrity…
— Amit Shah (@AmitShah) December 11, 2023
'తీర్పును స్వాగతిస్తున్నాం'
ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో సమానంగా జమ్మూకశ్మీర్ ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ సర్కారు ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు. మరోవైపు, సుప్రీం తీర్పును తాము కూడా స్వాగతిస్తున్నట్లు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. జమ్మూకశ్మీర్ లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, అంతకంటే ముందు పీవోకేను భారత్ లో విలీనం చేయాలన్నారు.
కొందరి అసంతృప్తి
ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిరాశ కలిగించిందని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్ధుల్లా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసేందుకు బీజేపీకి కొన్ని దశాబ్దాలు పట్టిందని, తాము కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడుతున్నామని చెప్పారు. ఈ అంశంపై మత పోరాటం కొనసాగుతుందంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంపై ఓ వర్గం ప్రజలు సంతోషంగా ఉండరని జమ్మూకశ్మీర్ చివరి రాజు హరిసింగ్ కుమారుడు, కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ అన్నారు. ఏది ఏమైనా తీర్పును అంగీకరించాలని వారిని కోరుతున్నట్లు చెప్పారు. 'దీనిపై వ్యతిరేకంగా వెళ్లి ప్రయోజనం లేదు. వారంతా వచ్చే ఎన్నికల పోరాటానికి సిద్ధం కావాలి' అని సూచించారు.
Also Read: Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టీకరణ