Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టీకరణ
Supreme Court on Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఈ ఆర్టికల్ ను కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది.
Supreme Court Verdict on Article 370: జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (Article 370) రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్ (Jammu kashmir) కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టి పారేయలేమని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ ఆర్టికల్ రద్దుపై రాష్ట్రపత్రి ఉత్తర్వులను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం, పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. ఈ అంశంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
సుప్రీం కీలక వ్యాఖ్యలు
'ఆర్టికల్ 370.. జమ్ము కశ్మీర్ లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఆ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370 ఏర్పాటు తాత్కాలిక వెసులుబాటు మాత్రమే తప్ప శాశ్వతం కాదు. దేశంలో విలీనం అయినప్పుడు జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదు. విలీనం తర్వాత కూడా జమ్మూ కశ్మీర్ కు అంతర్గత సార్వభౌమాధికారం ఇవ్వలేదు. ఆర్టికల్ 370ను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్ముకశ్మీర్ కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో అది సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం భారత్ లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమే. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదు. 370 ఆర్టికల్ రద్దు అంశంపై ఇప్పటికే 3 తీర్పులు ఉన్నాయి. గత తీర్పులను పిటిషనర్లు సవాల్ చేయలేదు.' అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఎన్నికలు ఎప్పుడంటే.?
ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సైతం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రస్తుతం, జమ్మూకశ్మీర్ లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2024, సెప్టెంబర్ 30లోగా జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది.
ఇదీ జరిగింది
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న పూర్తిగా రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూకశ్మీర్ కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 2 నుంచి సుదీర్ఘంగా విచారించింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసి సోమవారం తాజాగా తీర్పు వెలువరించింది. కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. గత రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా, మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Also Read: Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె