PM Modi: నాకు ఆర్భాటం ఇష్టం ఉండదు, అందుకే మీడియాకి దూరంగా ఉంటా - మోదీ కీలక వ్యాఖ్యలు
Lok Sabha Election 2024: హంగు ఆర్భాటాలు ఇష్టం లేకపోవడం వల్లే మీడియాకి తాను దూరంగా ఉంటానని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi News: ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న కంప్లెయింట్స్‌లో ఒకటి..ఆయన మీడియాతో ఎక్కువగా మాట్లాడరని. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టరని. ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో దీనిపై తీవ్ర విమర్శలు చేశాయి. విదేశీ పర్యటనలపై ఉన్న ఆసక్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌లపై ఉండదని మండి పడ్డాయి. అయితే...ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ విమర్శలకు సమాధానమిచ్చారు. తాను ఎందుకు మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వరో వివరించారు. ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా మీడియాకి దూరంగా ఉండాలని అనుకోలేదని, ప్రజలకు చేరువయ్యేందుకు ఇప్పుడు చాలా రకాల వేదికలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ప్రస్తుతం మీడియా ఉండాల్సిన రీతిలో ఉండడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తనకు హంగు ఆర్భాటాలతో పని లేదని, చిన్న చిన్న పనులకే ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. మీడియాని కొంత మంది వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని మండి పడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాకి అందుబాటులో ఉన్న మోదీ..ప్రధాని అయ్యాక పట్టించుకోవడం మానేశారన్న ఆరోపణలపైనా స్పందించారు.
"నాకు కష్టపడడం ఇష్టం. నిరుపేదల ఇళ్లకి వెళ్లి వాళ్లని పలకరించడం ఇష్టం. రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్స్‌కి వెళ్లి అక్కడ ఫొటోలు తీయించుకుని వాటిని ఫ్రేమ్‌లు కట్టించుకోవచ్చు. కానీ నేనలా చేయను. ఎక్కడో మారుమూలన ఉన్న ఓ గ్రామానికి వెళ్లి అక్కడో చిన్న పథకంపైన పని చేస్తాను. దాని గురించి ఆలోచిస్తాను. నిజానికి నేను ఇలా కొత్త వర్క్ కల్చర్‌ని సృష్టించానని నమ్ముతున్నాను."
- ప్రధాని మోదీ
ఇవాళ మీడియాని, ప్రజల్ని విడదీసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. గతంలో కమ్యూనికేషన్ అంతా మీడియా ద్వారానే జరిగేదని, ఇప్పుడలా కాదని అన్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అభిప్రాయాల్ని తెలియజేయడం చాలా సులువైపోయిందని స్పష్టం చేశారు. మీడియా లేకుండా కూడా తమతమ అభిప్రాయాల్ని చెప్పే వెసులుబాటు వచ్చిందని వెల్లడించారు.