Naveen Patnaik: నేను ఆరోగ్యంగా ఉన్నా, ఓట్ల కోసమే ఈ పుకార్లు - మోదీకి నవీన్ పట్నాయక్ కౌంటర్
PM Modi: తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ చెప్పినవన్నీ పుకార్లేనని తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.
Naveen Patnaik Health Row: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని, దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందని అన్నారు. ఆయన సన్నిహితులే ఈ విషయం తనతో చెప్పారనీ వెల్లడించారు మోదీ. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఇప్పుడు స్వయంగా నవీన్ పట్నాయక్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తానూ నెల రోజులుగా పాల్గొన్నట్టు గుర్తు చేశారు. ప్రధాని మోదీ తనకు కాల్ చేసి ఎలా ఉన్నానో అడిగి ఉండాల్సిందని అన్నారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే ఇలాంటి పుకార్లు పుట్టిస్తుంటారని మండి పడ్డారు. దాదాపు పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ఇదే చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
"ప్రధాని మోదీ చాలా సార్లు బహిరంగంగానే నవీన్ పట్నాయక్ నాకు మంచి మిత్రుడు అని చెప్పారు. నిజంగా ఆయనకు నా ఆరోగ్యంపై అంత ఆందోళన ఉంటే నాకే కాల్ చేసి మాట్లాడాల్సింది. నేను ఫోన్‌లోనే క్లారిటీ ఇచ్చేవాడిని. ఇలా పదేపదే పబ్లిక్ ర్యాలీలలో నా ఆరోగ్యం గురించి కామెంట్స్ చేయడం ఎందుకు..? కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మోదీ చేస్తున్న స్టంట్ తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను"
- నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం
#WATCH | On PM Narendra Modi, Odisha CM Naveen Patnaik says, "I have done that (dialling PM Modi) often. The Prime Minister has said in recent public meetings that I am a good friend of his. So, if he heard these rumours and was concerned about it, was it not his duty to pick up… pic.twitter.com/OfMIERNYcC
— ANI (@ANI) May 30, 2024
పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మోదీ ఒడిశాలో ర్యాలీలో పాల్గొన్న సమయంలో పట్నాయక్ గురించి ప్రస్తావించారు. ఆయన ఏమీ చేయలేకపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి కారణమేంటో ప్రత్యేకంగా ఓ కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. ఉన్నట్టుండి ఆయన ఎందుకలా అయ్యారో తెలుసుకోవాల్సిన అవసరముందని అన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై BJD నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్‌ని అవమానిస్తున్నారని మండి పడ్డారు. జూన్ 10వ తేదీన కమిటీ వేస్తామని మోదీ చెప్పడాన్నీ తప్పుబడుతున్నారు. కచ్చితంగా విచారణ చేపట్టి తీరతామని ప్రకటించడంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: PM Modi: మోదీ ధ్యానం వెనక ఇంత స్ట్రాటెజీ ఉందా? ఆ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నట్టు?