Pakistan Election: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు, ఉత్కంఠగా కొనసాగుతున్న పోలింగ్
Pakistan Election 2024: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.
Pakistan Election: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఎన్నికలు (Pakistan Election) జరుగుతున్నాయి. Pakistan Tehreek-e-Insaf (PTI) పార్టీ తరపున మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఎన్నికల బరిలోకి దిగారు. అటు Pakistan Muslim League (PML-N) తరపున నవాజ్ షరీఫ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌కి మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నవాజ్ షరీఫ్ పోటీతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ కూడా పోటీ చేస్తున్నాడు. భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేశాడు. అయితే...ఈ సారి ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవచ్చని అక్కడి రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాయాది దేశంలో ఎప్పుడూ సైన్యానిదే పై చేయి. ప్రభుత్వం ఉన్నప్పటికీ అంతా సైన్యం చెప్పినట్టే నడుస్తుంది. దాదాపు 76 ఏళ్లుగా ఇదే పరిస్థితి. మధ్యలో కొన్నేళ్లు మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంది పాక్ మిలిటరీ. పాక్ మిలిటరీ మద్దతు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. PTI చీఫ్ ఇమ్రాన్ ఖాన్ చాలా సందర్భాల్లో సైన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనపై హత్యా ప్రయత్నం జరగడం నుంచి జైలుకి పంపే వరకూ అంతా సైన్యం కుట్రే అని ఆరోపించారు. ఈ లెక్కన చూస్తే నవాజ్ షరీఫ్‌కి మిలిటరీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నట్టే.
2018లో ఎన్నికలు జరిగిన తరవాత ఇమ్రాన్ ఖాన్‌కే మిలిటరీ సపోర్ట్ ఉంటుందని అంతా భావించారు. ఆ సమయానికి నవాజ్ షరీఫ్ జైల్లో ఉన్నాడు. ఆ తరవాత అక్కడి రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. నవాజ్ షరీఫ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తరవాత ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి మెజార్టీ వస్తుందో చెప్పలేమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే రాజకీయాలు మరింత నాటకీయంగా మారిపోయే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయి. 336 సభ్యులతో కూడిన నేషనల్ అసెంబ్లీలో 169 సీట్లు సాధించిన వాళ్లు గెలిచినట్టు లెక్క. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఎన్నికల తరవాత వాళ్లు ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశముంది.
పాకిస్థాన్‌లో ఎన్నికలకు సరిగ్గా ఓ రోజు ముందు అలజడి రేగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లు స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ పేలుళ్లలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న ఓ స్వతంత్ర అభ్యర్థి ఆఫీస్ బయటే ఓ బాంబు పేలింది. ఇక్కడే 17 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. గంటలోపే Jamiat-Ulema Islam-Pakistan ఎలక్షన్ ఆఫీస్ ఎదుట మరో బాంబు పేలింది. ఇక్కడ 8 మంది బలి అయ్యారు. ఆఫీస్ బయట ఓ బ్యాగ్‌లో బాంబు పెట్టారని, రిమోట్ కంట్రోల్‌తో దాన్ని ఆపరేట్ చేసి పేల్చారని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లలో గాయపడిన వాళ్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అకాశముంది.
Also Read: వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్, పార్లమెంట్‌లో బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ