Karnataka News: కర్ణాటకలో లిక్కర్ వ్యాపారుల సమ్మెబాట - ఒక రోజు బంద్ - కారణమేమిటంటే ?
Karnataka Bandh: కర్ణాటకలో లిక్కర్ వ్యాపారులు బంద్ బాట పట్టారు. ఇరవయ్యో తేదీన దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీరునే వారు కారణాలుగా చెబుతున్నారు.
Over 10,800 Liquor Shops to Down Shutters on Nov 20 Karnataka Bandh: కర్ణాటక ప్రభుత్వానికి ఏదీ కలసి రావడం లేదు. ఓ వైపు సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలు వస్తూంటే మరో వైపు విభిన్న వర్గాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. చివరికి లిక్కర్ వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక రోజు సమ్మె చేసేందుకు సిద్దమని ప్రకటించారు. వైన్ మర్చంట్స్ అసోసియేషన్ తాజాగా ఇరవయ్యో తేదీన సమ్మె చేస్తున్నట్లుగా ప్రకటించింది. కర్ణాటక మొత్తంగా 10, 800 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో 90 శాతం మూసివేస్తామని వారు చెబుతున్నారు.
ఎక్సైజ్ శాఖలో అవినీతి అని లిక్కర్ వ్యాపారుల ఆరోపణలు
ప్రభుత్వంపై మద్యం వ్యాపారులకు ఎందుకు కోపం వచ్చిందంటే.. ఇష్టం వచ్చినట్లుగా దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేస్తోందట. అందుకే తమకు మార్జిన్ ప్రకారం కూడా లాభాలు రావడం లేదని.. నష్టాలపాలవుతున్నామని లిక్కర్ వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతలు లంచాలకు అలవాటు పడి దుకాణాలకు ఓ పద్దతి లేకుండా అనుమతులు ఇస్తున్నారని వారంటున్నారు. కర్ణాటకలో మద్యం దుకాణాలను లాటరీ పద్దతిలో కేటాయిస్తున్నారు. ఇలా లైసెన్సులు తీసుకుని ... ఫీజులు కట్టి చేస్తున్న వ్యాపారలతో తాము నష్టపోతున్నామని వారు అంటున్నారు.
లంచాలు తీసుకుని దుకాణాలకు లైసెన్స్‌లు ఇస్తున్నారని విమర్శలు
ఏడాదికి ప్రభుత్వానికి రూ. 38 వేలకోట్లకుపైగా ఆదాయాన్ని మద్యందుకాణ దారులు అందిస్తున్నారని వారి పట్ల కుట్ర పూరితంగా వ్యవహరించకూడదని అంటున్నారు. కర్ణాటక ఎక్సైజ్ డిపార్టుమెంట్‌లో అవినీతి భరించలేనంతగా పెరిగిపోయిందని మండిపడుతున్నారు. ఈ అవినీతి వల్ల తాము వ్యాపారులు చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. లిక్కర్ వ్యాపారుల ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ నిర్ణయాన్ని కర్ణాటక టూరిజం హోటల్స్ వ్యతిరేకిస్తున్నాయి. తమ అసోసియేషన్ ఈ బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా లేదని వారు ప్రకటించారు. కర్ణాటక వ్యాప్తంగా రెండు వేల వరకూ టూరిజం హోటల్స్ ఉన్నాయి.
Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !
బంద్‌కు టూరిజం హోటల్స్ దూరం
లిక్కర్ వ్యాపారులు చేస్తున్న ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమర్థింపులు చేసుకోలేకపోతోంది. అయితే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇతర పార్టీలు మండి పడుతున్నాయి. తక్షణం ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని .. లిక్కర్ వ్యాపారుల ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొత్త దుకాణాల లైసెన్సులు ఇవ్వకుండా వ్యాపారం అంతా వారే గుత్తాధిపత్యంలో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు.