Income Tax : గల్ఫ్ దేశాల్లో ఆదాయపు పన్నే లేదు - కానీ ఇప్పుడు ఆ దేశాలు కూడా రెడీ - మొదట ఒమన్
Oman Income Tax : గల్ఫ్ దేశాల్లో ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను లేదు. ఎంత సంపాదించుకున్నా ఒక్క పైసా కూడా కట్టాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఒమన్ దేశం మొదటి సారిగా పన్ను ఆలోచనచేస్తోంది.
Oman To Introduce Income Tax : మన దేశంలో ఆదాయపు పన్ను పెద్ద మ్యాటర్. మూడు లక్షల ఆదాయం దాటిన ప్రతి ఒక్కరూ పన్నులు కట్టాలి. మిగిలిన ఆదాయాన్ని ఖర్చు చేస్తే దానికీ పన్నులు కట్టాలి.ఈ పన్నుల అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది.
ఇప్పటి వరకూ గల్ఫ్ దేశాల్లో లేని ఆదాయపు పన్ను
అయితే గల్ఫ్ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను ఉండదు. గల్ఫ్ లో ఎంత సంపాదించుకున్నా అక్కడి ప్రభుత్వాలు పైసా కూడా పన్నులు వసూలు చేయవు. పరిమితమైన వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంతోనే దేశాన్ని నడిపిస్తూంటారు. ఆయిల్ రిచ్ కంట్రీస్ కావడంతో వారికి.. ప్రభుత్వాలకు.. రాజులకు డబ్బులకు కొదవ ఉండదు. అదే సమయంలో అక్కడ సంపాదించుకుని ఇండియాకు పంపించినా ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ సంపాదించుకోలేదు కాబట్టి ఇక్కడ పన్నులు కట్టాల్సిన పని ఉండదు. అందుకే ఎక్కువ మంది గల్ఫ్ దేశాల్లో ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తూంటారు.
5 నుంచి 9 శాతం ఆదాయపు పన్ను వసూలుకు ఒమన్ నిర్ణయం
అయితే ఇప్పుడు మెల్లగా సీన్ మారిపోతున్నట్లుగా కనిపిస్తోంది. తమ దేశానికి వచ్చి సంపాదించుకుంటున్న వారిపై పన్నులు వేయాలని ఒమన్ దేశం తాజాగా నిర్ణయించించినట్లుగా తెలుస్తోంది. గల్ఫ్ దేశాల కూటమిలో ఒమన్ ఒక్కటే మొదటి సారిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా మన రూపాయల్లో రూ. 84 లక్షలకుపైగా సంపాదించే వారిపై ఐదు నుంచి తొమ్మిది శాతం పన్నులు విధించాలని ఒమన్ దేశం నిర్ణయించింది. ప్రస్తుతం ఒమన్ లో భారతీయులు ఆరు లక్షల మంది వరకూ పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ వీరంతా పన్నులు కట్టకుండా పూర్తి ఆదాయాన్ని పొందుతున్నారు. ఒమన్ నిర్ణయం అమల్లోకి వస్తే వీరు తమ ఆదాయంలో ఐదు నుంచి తొమ్మిది శాతం కోల్పోనున్నారు.
భారతీయులకు ఇబ్బందే - భారత్‌కు పంపే నగదుపై ప్రభావం
ఒమన్ తర్వాత కువైట్ కూడా .. జీరో ఇన్ కమ్ ట్యాక్స్ విధానాన్ని ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే సౌదీ అరేబియా, యూఏఈ మాత్రం.. ఇంకా తమకు అలాంటి ఆలోచన లేదని చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. వారు అక్కడ సంపాదించుకున్న దానికి ఏటా కనీసం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇండియాకు పంపిస్తూంటారని అంచనా. మొత్తంగా ఆయిల్ పై వచ్చే ఆదాయంతో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే గల్ఫ్ దేశాలు ఇప్పుడు పన్నులను కూడా వసూలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. గతంలో వ్యాట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు వ్యాట్ విధిస్తున్నారు. త్వరలో ఆదాయపు పన్నునూ వడ్డించే అవకాశాలు ఉన్నాయి.