Odisha Train Accident: స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే సగం ప్రమాదాలు, గతంలోనే రైల్వే బోర్డ్ రిపోర్ట్
Odisha Train Accident: భారత్‌లో సగం రైలు ప్రమాదాలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని గతంలోనే రైల్వే బోర్డ్ స్పష్టం చేసింది.
Odisha Train Accident:
57% మానవ తప్పిదాల వల్లే..
భారత్‌లో జరిగే రైలు ప్రమాదాల్లో సగం "నిర్లక్ష్యం" వల్లే జరుగుతున్నాయట. స్వయంగా రైల్వే బోర్డ్ చెప్పిన విషయం ఇది. ప్రమాదాల్లో దాదాపు 57% మేర మానవ తప్పిదాల కారణంగానే సంభవిస్తున్నాయని తేల్చి చెప్పింది. గతేడాది RTI క్వెయిరీకి బోర్డ్ ఈ సమాధానమిచ్చింది. 2021-22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 35 రైలు ప్రమాదాలు జరిగాయి. వాటిలో ఎక్కువ శాతం పట్టాలు తప్పడం వల్లే జరిగాయి. ఈ ప్రమాదాల కారణంగా రైల్వేకి రూ.68 కోట్ల 75 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. రైల్వే ప్రాపర్టీస్ చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. ప్రాణనష్టమూ భారీగానే వాటిల్లింది. 2021-22 లో మొత్తం 35 ప్రమాదాలు జరగ్గా వాటిలో 20 ప్రమాదాలు కేవలం రైల్వే స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే జరిగాయని రైల్వే బోర్డు స్పష్టంగా చెప్పింది. అయితే...ఈ ఘటనలు జరిగినప్పుడు అందుకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో కుట్రల కారణంగానూ ప్రమాదాలు జరిగాయి. గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని బచేలి నుంచి విశాఖకు వెళ్లే గూడ్స్ ట్రైన్‌పై మావోయిస్ట్‌లు దాడి చేశారు. ఫలితంగా...ఈ ట్రైన్ పట్టాలు తప్పి పడిపోయింది. గతంలోనూ ఇలాంటి దాడుల కారణంగా రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లింది. అయితే...రైల్వే స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదానికీ "హ్యూమన్ ఎర్రర్" కారణమై ఉండొచ్చని అంటున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల వల్ల భారీ ప్రాణనష్టం నమోదైందని కొందరు వాదిస్తున్నారు.
రైల్వే శాఖపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిగ్నలింగ్ సిస్టమ్‌లో వైఫల్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జోనల్ ఆఫీసర్స్‌కి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జనరల్ మేనేజర్స్‌కి లెటర్‌లు కూడా రాశారు. అధికారులు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే కొన్ని ప్రమాదాలు జరిగాయని హెచ్చరించారు.
"రైల్వే ప్రాపర్టీస్‌ని తరచూ చెక్ చేయకపోవడం, రైల్ కండీషన్‌ని సరిగ్గా గమనించకపోవడం, డిజైన్‌లలో లోపాలను గుర్తించకపోవడం, పట్టాలను రెగ్యులర్‌గా ఇన్‌స్పెక్ట్ చేయకపోవడం...ఇలాంటి తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న నిర్లక్ష్యమైనా సరే...వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి."
- రైల్వో బోర్డ్ అధికారులు
రైల్వే బోర్డ్ వార్నింగ్..
ఇంత స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినా ఇప్పుడు భారీ ప్రమాదం జరిగింది. ఇది కూడా కచ్చితంగా మానవ తప్పిదం వల్లే జరిగిందని కొందరు వాదిస్తున్నారు. సిగ్నల్ ఇవ్వడంలో పొరపాటు వల్లే రైళ్లు ఒకటిని ఒకటి ఢీకొట్టుకున్నాయని అంటున్నారు. ఇందులో నిజానిజాలేంటో విచారణ తరవాతే తేలనుంది. ప్రస్తుతానికి రైల్వే శాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. పైగా ఈ రూట్‌లో కవచ్ సిస్టమ్ కూడా లేకపోవడం మరో సమస్యగా నిలిచింది. రైళ్ల ప్రమాదాలను నిలువరించేందుకు తీసుకొచ్చిన ఈ సిస్టమ్ ఉండి ఉంటే ప్రాణనష్టం తప్పేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కారణాలేవైనా...వందలాది మంది బలి అయ్యారు.
Also Read: Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?