Generic Medicines: జనరిక్ మెడిసిన్ నే రాయాలి, లేదంటే లైసెన్స్ సస్పెండ్ - NMC కొత్త రూల్స్
Generic Medicines: డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మెడిసిన్ ను రాయాలని కేంద్రం ఆదేశించింది. లేదంటే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
Generic Medicines: మందుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మెడిసిన్ ను రాయాలని కేంద్రం ఆదేశించింది. లేదంటే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లైసెన్సులను కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (NMCRMP) అనే పేరుతో జారీ చేసిన కొత్త నిబంధనలో పేర్కొంది.
2022వ సంవత్సరంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (IMC) జారీచేసిన నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి డాక్టర్ జనరిక్ మందులనే పిస్క్రైబ్ చేయాలని (జనరిక్ మెడిసిన్స్ రాయాలని) సూచనలు ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా వ్యవహరించే డాక్టర్లపై ఎలాంటి చర్యలను తీసుకోవాలో అందులో పేర్కొనలేదు. తాజాగా ఆ నిబంధనల స్థానంలో NMCRMP 2023 అమల్లోకి తెచ్చినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) వెల్లడించింది. ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై చర్యలు కూడా నిబంధనలో పేర్కొంది.
"ప్రతి RMP (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్ మందులనే సూచించాలి. పేషెంట్లకు సరైన మందులను సూచించాలి, అనవసరమైన మందులే తప్ప ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ టాబ్లెట్‌లను నివారించాలి" అని నిబంధనలో సూచించింది.
ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు డాక్టర్లను హెచ్చరించడంతోపాటు వర్క్ షాపులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారు. ఒకవేళ పదేపదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే... ఆ డాక్టర్ లైసెన్సును కొంతకాలం పాటు నిలిపి వేయనున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ హెచ్చరించింది. వైద్య నిపుణులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న, రోగులకు అందుబాటులో ఉండే జనరిక్ మందులను మాత్రమే వాడేలా మందుల చీటీ రాయాలి. వారు ఆసుపత్రులు, స్థానిక ఫార్మసీలో జెనరిక్ ఔషధాలను నిల్వ చేయడానికి కూడా చేయాలని NMC నియంత్రణ పేర్కొంది.
ఇక డాక్టర్లు రాసే మందుల చీటీలో మందుల పేర్లను క్యాపిటల్ లెటర్స్ లల్లో రాయాలని జాతీయ మెడికల్ కౌన్సిల్ కొత్త నిబంధనలో పేర్కొంది. ప్రిస్క్రిప్షన్‌లు చదవగలిగేలా ఉండాలని వెల్లడించింది. " ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి తన సంపాదనలో అధిక భాగం హెల్త్ కేర్ కోసమే వెచ్చించాల్సి వస్తుంది. అయితే బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందుల ధరలు 30 నుంచి 80% వరకు తక్కువగానే ఉన్నాయి. డాక్టర్ జనరిక్ మెడిసిన్ నే డిస్క్రైబ్ చేయడం వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించినట్లు అవుతుంది" అని ఎన్ఎంసి తన నిబంధనలో వెల్లడించింది.
జనరిక్ మందులు అంటే ఏంటి?
ఒక కొత్త ఫార్ములా కనుగొనడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. అన్ని పరీక్షలు పూర్తయ్యాక వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. అవే బ్రాండెడ్ మందులు. ఆ మందు తయారీపై, ఆ ఫార్మా కంపెనీకి ఇరవై ఏళ్ల పాటూ పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో వేరే వాళ్లు ఆ మందును అదే ఫార్ములాతో తయారు చేయకూడదు. ప్రభుత్వాలు కూడా పేటెంట్ పేరుతో ఆ హక్కును సదరు కంపెనీకి ఇస్తాయి. 20 ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. అలా అదే ఫార్ములాతో మందులు తయారుచేసి తక్కువ రేటుకే జనరిక్ మందుల షాపుల్లో అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఇలా వేరే ఫార్మా సంస్థల ఫార్ములాతో మందును తయారు చేసి తక్కువ రేటుకే పేదల కోసం అమ్మే వాటిని జనరిక్ మందులు అంటారు.