Modi 3.0 NDA Meeting: మోదీని కడుపుబ్బా నవ్వించిన నితీశ్, NDA సమావేశంలో కాసేపు కోలాహలం
NDA Parliamentary Party Meeting: NDA సమావేశంలో నితీశ్ కుమార్ తన ప్రసంగంతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు.
NDA Party Meeting: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో NDA 3.0 మీటింగ్ జరిగింది. కూటమికి చెందిన కీలక ఎంపీలు, నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీని NDA పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమయంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది. తనదైన శైలిలో ప్రధాని మోదీని పొగిడారు నితీశ్. ఛలోక్తులూ విసిరారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ హాల్ నవ్వులతో మారు మోగిపోయింది. NDAతోనే ప్రయాణిస్తానని చెబుతూనే ఇండీ కూటమికి చురకలు అంటించారు నితీశ్. మోదీపై ప్రశంసలు కురిపిస్తూ ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. "ఈ సారి అక్కడక్కడా గెలిచిన వాళ్లు కచ్చితంగా వచ్చే సారి ఓడిపోతారు. ఆ విషయంలో మాకు భరోసా ఉంది" అని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేయగానే ఎంపీలంతా బల్లలు చరుస్తూ గట్టిగా నవ్వుకున్నారు.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Bihar CM- JD(U) chief Nitish Kumar says "...'Agli baar jab aap aaiye toh kuch log jo idhar udhar jeet gaya hai, agli baar sab haarega. Humko poora bharosa hai'..." pic.twitter.com/WtZT3KrOGM
— ANI (@ANI) June 7, 2024
ఆ తరవాత కూడా నితీశ్ ప్రసంగం ఇలా సరదాగా కొనసాగింది. మోదీ గెలవడం సంతోషకరంగా ఉందని చెబుతూనే బిహార్‌లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయొచ్చు అంటూ మోదీవైపు చూశారు నితీశ్. అప్పుడు కూడా ఎంపీలంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఇక మోదీ ప్రమాణస్వీకారం గురించీ ఇదే విధంగా మాట్లాడారు. "మీరు ఇవాళే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. ఈ మాట విన్న వెంటనే మోదీ నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"బిహార్‌లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఇకపై పూర్తవుతాయన్న భరోసా వచ్చింది. మీతో (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ నాకు మాత్రం మీరు ఇప్పుడే ఆ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరెప్పుడు ఈ బాధ్యతలు తీసుకున్నా సరే. మేం మీకు మద్దతుగా ఉంటాం"
- నితీశ్ కుమార్, జేడీయూ అధినేత
#WATCH | At the NDA Parliamentary Party meeting, Bihar CM- JD(U) chief Nitish Kumar says "All the pending works of Bihar will be done. It is a very good thing that all of us have come together and we will all work together with you (PM Modi). You will be swearing in as the Prime… pic.twitter.com/GhIjU1r5FJ
— ANI (@ANI) June 7, 2024