Pegasus : పెగాసస్‌పై విచారణ జరిపించాల్సిందే..! బీజేపీకి షాకిచ్చిన మిత్రోం నితీష్..!
పెగాసస్ స్కాండల్‌పై విచారణకు ఇప్పటి వరకూ విపక్షాలే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా వారితో గొంతు కలిపింది.
పెగాసస్ స్పైవేర్ విషయంలో విచారణ జరిపించాల్సిందేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన జనతా దళ్ యునైటెడ్‌కు సుప్రీంలీడర్‌గా ఉన్న నితీష్ ఒక్క సారిగా పెగాసస్‌పై వాయిస్ పెంచడం బీజేపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. విచారణ మాత్రమే కాదు.. పార్లమెంట్‌లోనూ ఆ అంశంపై చర్చించాల్సిందేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. పట్నాలో మీడియాతో మాట్లాడిన నితీష్ ఈ విషయంపై కేంద్రం ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసి.. నిజానిజాలేంటో ప్రజలకు తెలియ చెప్పాలని కోరారు.
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వమే విపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులపై నిఘా పెట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌ను విపక్షాలు జరగనీయడం లేదు. అదే సమయంలో ప్రముఖ జర్నలిస్టులు విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. అయితే ఈ అంశంపై కేంద్రం ఓ స్పష్టమైన విధానంతో ఉంది. అదేమిటంటే... సైలెంట్‌గా ఉండటం. ఏమీ వివరాలు వెల్లడించకపోవడం. దీంతో విపక్షాలు మరింతగా ఆరోపణలు చేస్తున్నాయి.
పెగసస్ నిఘాసాఫ్ట్‌వేర్ సేవలు అందించే ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌వో.. తాము తమ సాఫ్ట్‌వేర్‌ను ఇంత వరకూ ప్రభుత్వాలకే అమ్మామని.. ప్రైవేటు వ్యక్తులకు కాదని చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా ప్రభుత్వానికి అమ్మారో లేదో చెప్పడం లేదు. అలా తాము కొనుగోలు చేశామో లేదో... భారత సర్కార్ కూడా చెప్పడం లేదు. కేంద్రం ఏ వివరాలు చెప్పకపోవడంతోనే విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ పెగాసస్‌ను ఇండియా ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయితే... ఆ విషయం చెప్పి.. దుర్వినియోగం చేయలేదని... రాజకీయప్రయోజనాల కోసం వాడలేదని ప్రకటించాల్సి ఉందని విపక్షాలు అంటున్నాయి. కొన్ని ప్రభుత్వాలు తమ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేశాయని తేలిందని.. ఆ ప్రభుత్వాలకు తమ సేవలు నిలిపివేస్తున్నామని ఇజ్రాయెల్ సంస్థ ప్రకటించింది. ఆ జాబితాలో ఇండియా ఉందో లేదో స్పష్టత లేదు.
అయితే ఇప్పటికే పెగాసస్‌పై విచారణకు కేవలం విపక్షాలు మాత్రమే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్డీఏలోని పక్షాలు కూడా విచారణకు డిమాండ్ చేస్తూండటం.. బీజేపీ పెద్దలకు కాస్త తలనొప్పి తెప్పించే వ్యవహారమే. పెగసస్‌తో నిఘా పెట్టింది... కేవలం విపక్షాలపైనే కాదని.. మిత్రపక్షాలు..., సొంత పార్టీ నేతలపైనా అని... కూడా కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. దీంతో... మిత్రపక్షాలు కూడా ఇప్పుడు నోరు పెగుల్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలో మరికొంత మంది బయటకు వస్తే.. , కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు విచారణకు ఆదేశించే పరిస్థితులు ఏర్పడుతాయని అంచనా వేస్తున్నారు.