Nageswara rao arrest: కందుకూరు టీడీపీ ఇంఛార్జ్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారా, లేక కిడ్నాప్ చేశారా?
జగన్ కంసుడిలా పాపాలు చేస్తున్నారని, అవన్నీ బూమరాంగ్ అవుతాయన్నారు అజీజ్. డీఎస్పీలు సీఐలు ఫోన్లు ఎత్తడం లేదన, అసలు నాగేశ్వరరావు ను మీరే అరెస్ట్ చేశారా...? లేక కిడ్నాప్ చేశారా ? అని ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా కందుకూరు దుర్ఘటనకు బాధ్యుడుగా నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వేధింపుల్లో భాగంగానే నాగేశ్వర రావు ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 8 మంది పోలీసులు మఫ్టీలో వెళ్లి దొంగని అరెస్ట్ చేసినట్టు ఆయన్ను తీసుకెళ్లారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నేంచారు. రాజ్యాధికారం ఉందని వేధింపులకు గురి చేయటం గొప్ప కాదన్నారు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంసుడిలా పాపాలు చేస్తున్నారని, అవన్నీ తిరిగి బూమరాంగ్ అవుతాయన్నారు అజీజ్. డీఎస్పీలు సీఐలు ఫోన్లు ఎత్తడం లేదని, అసలు నాగేశ్వరరావు ను మీరే అరెస్ట్ చేశారా ? లేక కిడ్నాప్ చేశారా ? అని ప్రశ్నించారు. కందుకూరు సభకు టీడీపీ పర్మిషన్ తీసుకుందని గుర్తు చేశారు. 30 వేల మంది జనాభా వచ్చే సభకు, వారిని కంట్రోల్ చేసేందుకు కనీసం 50 మంది పోలీసులు కూడా రాలేదన్నారు అజీజ్. గోదావరి లో పడవ మునిగి చనిపోయిన 36 మందిని జగన్ చంపేసినట్టా అని ప్రశ్నించారు అబ్దుల్ అజీజ్.
గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కందుకూరు పోలీసులమని చెబుతున్న 8 మంది మఫ్టీలో వచ్చి లాక్కెళ్లాని ఆరోపించారు టీడీపీ నేతలు. నాగేశ్వరావు తనను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారని, కందుకూరు ఘటనకు నువ్వే కారణమని జవాబు ఇచ్చారని నేతలు వివరించారు. కందుకూరు ఘటనను కారణంగా చూపి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు పర్యటనకు వచ్చే ప్రజలను నిరుత్సాహపరచడానికి పథకం ప్రకారం వైసీపీ చేస్తున్న కుట్ర ఇదని అన్నారు. ఆ కుట్రలు ఫలించవని చెప్పారు.
సభకు పర్మిషన్ ఇచ్చింది మీరే కదా..?
కందుకూరులో సభకు అనుమతి కోరగా, ఫలానా ప్రదేశం అని చెప్పకుండా కందుకూర్ టౌన్ లో పర్మిషన్ ఇస్తున్నామని పోలీసులు లెటర్ ఇచ్చారని అంటున్నారు టీడీపీ నేతలు. దురదృష్టవశాత్తు బహిరంగ సభ పెట్టిన చోట తొక్కిసలాట జరిగిందని అన్నారు. కందుకూరులో బహిరంగ సభకు పర్మిషన్ ఇచ్చిన వారు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ కల్పించాల్సిన కనీస రక్షణ కల్పించలేదని విమర్శించారు. దురదృష్ట సంఘటనలు జరిగితే కేసులు పెట్టడం సబబు కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అబ్దుల్ అజీజ్. చట్టాలు ఉన్నాయని చట్టాలపై తమకు నమ్మకం ఉందని, నాగేశ్వర రావు ను బయటకు తీసుకొస్తామని చెప్పారు.
నాగేశ్వరరావు అరెస్ట్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు స్పందిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు ఆయన అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు. వేధింపుల్లో భాగంగానే నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారని అంటున్నారు. ఆయన అరెస్ట్ తో టీడీపీపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్ ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు నేతలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబుని ఆపడం ఎవరి వల్లా కాదన అంటున్నారు టీడీపీ నేతలు.