Nellore Crime Roundup: పెరిగిన ప్రమాదాలు, బెట్టింగ్ కేసులు - నెల్లూరు జిల్లా 2023 క్రైమ్ రౌండప్
Nellore News: జిల్లాలో వరకట్న కేసులు, అదే సమయంలో ఆత్మహత్యలు పెరిగాయి. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఈ ఏడాది మే లో నెల్లూరు నగరంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
Nellore Crime Report: నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. అదే సమయంలో బెట్టింగ్ కేసుల నమోదు కూడా పెరిగింది. గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది కొన్నిరకాల కేసుల సంఖ్య పెరిగిందని తెలిపారు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. మరికొన్ని రకాల నేరాల్లో తగ్గుదల ఉందని వివరించారు. నెల్లూరు జిల్లాలో 2023 సంవత్సరానికి సంబంధించి నేరాల వివరాలను ఆయన వెల్లడించారు. గతేడాదితో పోల్చి చూస్తే ఓవరాల్ క్రైమ్ రేటు సగానికి తగ్గిందని తెలిపారు ఎస్పీ.
నెల్లూరు జిల్లాలో ఏయే విభాగాల్లో కేసులు పెరిగాయంటే..?
- రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. జిల్లాలో రెండు జాతీయ రహదారులున్నాయి. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే హైవేలో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.
- జిల్లాలో వరకట్న కేసులు, అదే సమయంలో ఆత్మహత్యలు పెరిగాయి. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఈ ఏడాది మే లో నెల్లూరు నగరంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
- ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఈ ఏడాది భారీగా పెరగడం విశేషం.
- క్రికెట్ బెట్టింగ్ కేసులు కూడా 2022తో పోల్చి చూస్తే 2023లో నెల్లూరులో భారీగా పెరిగాయి.
- గంజాయి కేసులు ఎక్కువ గా నమోదు చేశారు పోలీసులు. 9 మంది పై PD యాక్ట్ ఓపెన్ చేశారు. ఇటీవల నెల్లూరు నగర సమీపంలోనే కుటీర పరిశ్రమగా డ్రగ్స్ తయారీ చేయట్టడం విశేషం. ఈ కేసులో కూడా పక్కా ప్లానింగ్ తో పోలీసులు ఆ ఇంటిపై అటాక్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లాలో ఈ కింది విభాగాల్లో నేరాలు తగ్గాయి..
- కిడ్నాప్, మైనర్ బాలికల కిడ్నాప్ కేసులు 2023లో తగ్గాయి.
- గతేడాదితో పోల్చి చూస్తే కొట్లాటలు తగ్గాయి..
- చీటింగ్ కేసులు, మోసాలపై నమోదైన కేసులు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నమోదయ్యాయి. వాటిలో పెరుగుదల, తగ్గుదల లేదు.
- జిల్లాలో మానభంగం కేసులు సగానికి సగం తగ్గాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది రేప్ కేసులు తక్కువగా నమోదయ్యాయి.
- వేధింపుల కేసులు కూడా ఈ ఏడాది సగం తగ్గాయి.
- అట్రాసిటీ కేసుల నమోదు కూడా ఈ ఏడాది తగ్గింది.
ఇక మెగా లోక్ అదాలత్ లు జిల్లాలో నాలుగుసార్లు జరుగగా.. వాటిల్లో 4,159 కేసులు రాజీ అయ్యాయి. 307 రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు పోలీసులు. 200మందిపై సస్పెక్ట్ షీట్ లు తెరిచారు. మొబైల్ రికవరీలు కూడా ఈ ఏడాది బాగానే జరిగాయి. 1800 మందికి పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి అందించారు నెల్లూరు జిల్లా పోలీసులు. దిశ యాప్ ను 8 లక్షల వరకు జిల్లాలో ఇన్ స్టాల్ చేయించగలిగారు పోలీసులు. 100 నెంబర్ కి కాల్ వస్తే గతేడాది 10 నిమిషాల్లో బాధితులను రీచ్ అయిన రికార్డ్ ఉంది. ఈ ఏడాది కేవలం 9నిమిషాల్లోనే బాధితుల వద్దకు వెళ్లి సహాయం చేసిన సందర్భాలున్నాయి. బాధితులను రీచ్ అయ్యే టైమ్ సగటున 9 నిమిషాలుగా ఉంది. జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చే బాధితులు స్పందన కార్యక్రమంలో 3,722 పిటిషన్ లు ఇవ్వగా.. వాటిలో 3,716 ఫిర్యాదులను క్లియర్ చేసినట్టు తెలిపారు పోలీసు అధికారులు. ఇక జిల్లాలో ఈ ఏడాది సైబర్ ల్యాబ్ కూడా ప్రారంభించారు.