NCPCR on PUBG: బ్యాన్ చేసిన పబ్‌జీ ఇంకా ఎలా ఆడుతున్నారు, వివరణ కోరిన బాలల హక్కుల కమిషన్
పబ్‌జీ బ్యాన్ చేశాక కూడా పిల్లలు ఎలా ఆడుతున్నారంటూ ప్రశ్నించిన బాలల హక్కుల కమిషన్. వివరణ ఇవ్వాలంటూ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు లేఖ.
పబ్‌జీ ఇంకా బ్యాన్ కాలేదా..?
పబ్‌జీ ఉంటే చాలు. తిండి, తిప్పల్ని కూడా మర్చిపోతారు. బస్‌లలో, ట్రైన్లలో ఎక్కడ కాస్త ఖాళీ సమయం దొరికినా ఈ గేమ్‌కు అతుక్కుపోతారు. అంతెందుకు కొంత మంది విద్యార్థులు స్కూల్‌లు, కాలేజీల్లోనూ సీక్రెట్‌గా మొబైల్ తీసుకెళ్లి ఆడుతున్న సంఘటనలూ చూశాం. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పబ్‌జీపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. క్రైమ్‌ని ప్రోత్సహించే విధంగా ఉందంటూ మండిపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ గేమ్‌ని బ్యాన్ చేసింది. ఈ నిర్ణయంతో పబ్‌జీ లవర్స్ అంతా షాక్ అయ్యారు. కానీ ఈ గేమ్‌ని బ్యాన్ చేసినా ఇంకా కొందరికి అందుబాటులోనే ఉంటోంది. ఇదే విషయమై వివరణ కోరింది నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్-NCPCR. బ్యాన్ చేసిన గేమ్ భారత్‌లో ఎలా అందుబాటులో ఉందో చెప్పాలంటూ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్-IOAకి కూడా లేఖ పంపింది NCPCR. పబ్‌జీతోపాటు బ్యాన్ అయిన ఇతర ఆన్‌లైన్ గేమ్స్ స్టేటస్ ఏంటో చెప్పాలని అడిగింది.
పబ్‌జీ మత్తులో పడి తల్లిని చంపిన బాలుడు
అసలు ఇప్పుడు పబ్‌జీ మరోసారి వార్తల్లోకి రావటానికి ఓ కారణముంది. పబ్‌జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించినందుకు లఖ్‌నవూలోని ఓ బాలుడు కన్నతల్లినే కాల్చి చంపాడు. ఆర్మీలో పని చేసే తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో తల్లిని హత్య చేయటం సంచలనమైంది. పబ్‌జీ పనైపోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి ఈ ఘటన జరగటం అందరినీ ఆందోళనకు గురి చేసింది. హత్య చేసిన తరవాత దాదాపు
మూడు రోజుల పాటు శవంతో ఇంట్లోనే ఉండిపోయాడు ఆ బాలుడు. పొరుగింటి వాళ్లకు అనుమానం రాకుండా రూమ్ ఫ్రెష్‌నర్స్ వినియోగించాడు. పబ్‌జీ కారణంగా ఇలాంటి నేరాలు జరగటం ఇదే తొలిసారేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ 14 ఏళ్ల బాలుడు పబ్‌జీ మత్తులో పడిపోయాడు. ఆడొద్దని వారించినందుకు కుటుంబ సభ్యుల్ని తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన. భారత్‌లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం వల్ల కేంద్రం బ్యాన్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో నిర్వహించిన సందర్భంలో ఓ తల్లి తన కుమారుడు పబ్‌జీకి బానిసైపోయాడంటూ వాపోయింది. పబ్‌జీ వాలా హై క్యా అంటూ ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సమస్య తీవ్రమవుతూనే వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ గేమ్ వెలుగులోకి వచ్చే సరికి ఉలిక్కిపడ్డారంతా.