Vijayasai Reddy: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిల సంగతేంటి? సభలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
Telugu News: ఆంధ్రాకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని కేంద్రం మంత్రి వెల్లడించారు.
AP Telangana News: ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల అంశం రాజ్యసభలో చర్చకు వచ్చింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ సమాధానం చెప్పారు. ఆంధ్రాకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని వెల్లడించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ ప్రకారం.. చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. విద్యుత్ బకాయిల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టులో ఆ రాష్ట్ర హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి.. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ గుర్తు చేశారు.
ఉమ్మడి ఏపీ నుంచి రెండు రాష్ట్రాలు విడిపోయాక 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ జెన్ కో ద్వారా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) విద్యుత్ సరఫరా చేసింది. ఆ మేరకు తెలంగాణ రూ.6756.92 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఆ బకాయిలను నెల రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 లోబడి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఆదేశాలు జారీ చేసిందని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ గుర్తు చేశారు. ఏపీకి తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన రూ.3441.78 కోట్ల రూపాయల అసలు డబ్బుతో పాటు రూ.3315.14 కోట్ల లేట్ పేమెంట్ సర్ ఛార్జీల రూపంలో చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హై కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దీంతో కేంద్ర విద్యుత్ శాఖ 2022 ఆగస్టు 29న ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు 2023 అక్టోబర్ 19న కొట్టివేసింది. ఈ తీర్పు గురించి కూడా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రాజ్యసభలో ప్రస్తావించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆ వ్యవహారం పెండింగ్ లో ఉందని వివరించారు.