Morbi Bridge Tragedy: జస్ట్ కేబుల్స్‌ను పాలిష్ చేసి, పెయింటింగ్ వేసి వదిలేశారంతే - మోర్బి కేసు విచారణలో షాకింగ్ నిజాలు
Morbi Bridge Tragedy: మోర్బి ఘటనలో విచారణ వేగంగా కొనసాగుతోంది.
Morbi Bridge Tragedy:
విచారణ వేగవంతం..
మోర్బి వంతెన కూలిన ఘటనలో విచారణ వేగంగా సాగుతోంది. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం వల్ల పోలీసులు వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకుంటున్న మేనేజర్ సహా ఇతర సిబ్బందిని ఇప్పటికే విచారించారు. ఆ తరవాత మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సందీప్ సింగ్‌ను విచారించారు. దాదాపు 4 గంటల పాటు ఇది కొనసాగింది. స్థానిక కంపెనీ Orevaతో కుదిరిన ఒప్పందంపై ప్రశ్నించారు పోలీసులు. ఆ తరవాత లోకల్ కోర్ట్‌కు ఈ విచారణకు సంబంధించినడాక్యుమెంట్లు సమర్పించారు. ఇందులో తేలిందేంటంటే...ఈ బ్రిడ్జ్ మరమ్మతుల కోసం ఓ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అయితే...ఈ కాంట్రాక్టర్లకు బ్రిడ్జ్‌ను మరమ్మతు చేయటమెలాగో పూర్తి స్థాయిలో అవగాహన లేనే లేదు. అంతకు ముందెన్నడూ వాళ్లు అలాంటి పనులు చేయలేదు. కేవలం బ్రిడ్జ్‌కు ఉన్న కేబుల్స్‌ను పాలిష్ చేసి పెయింటింగ్ చేసి వదిలేశారు. ఈ కంపెనీ ఈ బ్రిడ్జ్ రిపేర్ చేయడానికి పూర్తిగా అనర్హం అని విచారణలో తేలింది. అసలు ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే ముందు మున్సిపల్ అధికారులు ఎలాంటి విచారణ చేయలేదనీ వెల్లడైంది. ఈ బ్రిడ్జ్ కెపాసిటీ గురించి కూడా ఎక్కడా చర్చ రానే లేదు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా వినిపిస్తున్న మాట. మరో విషయం ఏంటంటే...బిడ్డింగ్ అనేది లేకుండానే నేరుగా Oreva కంపెనీకే ఈ కాంట్రాక్ట్ అప్పగించారు. ఇది కూడా వివాదాస్పదమవుతోంది. అయితే... మేనేజర్ సహా 9 మంది సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు..ఆ కంపెనీలోని ఉన్నత స్థాయి అధికారులను మాత్రం ఎందుకు విడిచిపెట్టారంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి.
పోలీసులపై విమర్శలు..
ఈ విమర్శలపై పోలీసులు స్పందిస్తున్నారు. తాము ఎవరినీ కాపాడే ప్రయత్నించటం లేదని తేల్చి చెబుతున్నారు. అసలు ఈ కాంట్రాక్ట్‌ను అంత సులువుగా ఎలా అప్పగించారనే అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టామని వివరిస్తున్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సంస్థ మేనేజర్, తదితర సిబ్బందిని విచారిస్తున్నారు. లోకల్ కోర్ట్‌లో విచారణ కొనసాగుతుండగా...డిప్యుటీ ఎస్‌పీ కోర్టుకు ఓ కీలక విషయం వెల్లడించారు. వంతెన వైర్లు తుప్పుపట్టి పోయాయని, వాటిని రిపేర్ చేయించి ఉంటే ప్రమాదం జరిగుండేదే కాదని వివరించారు. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న మేనేజర్ దీపక్ పరేఖ్‌తో సహా 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ మేనేజర్‌ను విచారిస్తున్న సమయంలో కోర్టులో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తోంది. "ఇలాంటి దుర్ఘటన జరగాలని దేవుడే కోరుకున్నాడేమో" అని ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. వైర్లకు తుప్పు పట్టిందని, వాటికి కనీసం ఆయిల్ కూడా రాయలేదని డిప్యుటీ ఎస్‌పీ స్పష్టం చేశారు.
Also Read: Mamata Banerjee Chennai Visit: మమతా బెనర్జీ డ్రమ్స్ ఎంత బాగా వాయించారో చూశారా - వీడియో