Monkeypox Case In Maharashtra: హమ్మయ్య వాళ్లకు మంకీపాక్స్ లేదట, తేల్చి చెప్పిన వైరాలజీ ఇన్‌స్టిట్యూట్
Monkeypox Case In Maharashtra: మహారాష్ట్ర నుంచి వచ్చిన 10 అనుమానిత శాంపిల్స్‌ను టెస్ట్ చేసిన పుణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ అందులో 9 మందికి వైరస్ సోకలేదని వెల్లడించింది.
![Monkeypox Case In Maharashtra: హమ్మయ్య వాళ్లకు మంకీపాక్స్ లేదట, తేల్చి చెప్పిన వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ Monkeypox Case In Maharashtra Nine Of Ten Samples Tested Negative For Virus Infection Monkeypox Case In Maharashtra: హమ్మయ్య వాళ్లకు మంకీపాక్స్ లేదట, తేల్చి చెప్పిన వైరాలజీ ఇన్‌స్టిట్యూట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/29/847872f26acd2f89bd646b4f267cc4401659082870_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Monkeypox Case In Maharashtra:
10 శాంపిల్స్‌లో 9 నెగటివ్..
భారత్‌లోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న తరుణంలో కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడైంది. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో మంకీపాక్స్ అనుమానిత సాంపిల్స్‌ని టెస్ట్ చేశారు. అందులో 10 నమూనాలు పరీక్షించగా, 9 సాంపిల్స్ మంకీపాక్స్ నెగటివ్‌గా నిర్ధరణైంది. నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. మరో సాంపిల్ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. గత నెలలో ఈ ఇన్‌స్టిట్యూట్‌కి శాంపిల్స్ పంపగా, ఇప్పుడు వాటి ఫలితాలు వెలువరించారు. అన్నీ మహారాష్ట్రకు చెందిన వారి శాంపిల్సే. అంటే...మహారాష్ట్రలో ఇప్పటి వరకూ ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదన్నమాట. అయితే ఈ శాంపిల్స్ ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది మాత్రం అధికారులు వెల్లడించలేదు. అనవసరమైన ఆందోళనలు పెంచకుండా ఉండేందుకే, ఇలా వివరాలు దాచి పెట్టారని తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులందరిపైనా దృష్టి సారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇప్పటికే భారత్‌లోనూ నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేరళలో ముగ్గురు మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా, దేశ రాజధాని దిల్లీలో ఒకరికి ఈ వైరస్ సోకింది. ఉన్నట్టుండి శరీరంపై దద్దుర్లు వచ్చినా, గత 21 రోజుల్లో ఎవరైనా విదేశాలకు వెళ్లొచ్చినా...అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ..
భారత్‌లోనూ మంకీపాక్స్ కేసులు నమోదవటం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. దిల్లీలో తొలి కేసు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్-DGHS ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. దిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకింది. భారత్‌లో ఇది నాలుగో కేసు కావటం కలవర పెడుతోంది. అయితే...ఈ బాధితుడి ట్రావెల్ హిస్టరీని పరిశీలించిన అధికారులు, అతడు విదేశాలకు వెళ్లిన దాఖలాలేవీ లేనట్టు తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి బాధితుడికి లోక్‌నాయక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యక్తి సాంపిల్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఐసోలేషన్‌లో ఉన్న బాధితుడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. "మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రజలెవరూ భయాందోళనలకు లోనుకావద్దు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం. వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు" అని ట్వీట్ చేశారు.
"ఎక్కడి నుంచి ఇది వ్యాప్తి చెందింది, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా నిర్వహించాలి" అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అప్రమత్తమైంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కేసులు నమోదవుతున్న ఆయా దేశాలకు పలు సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
Also Read: Chandra Babu Naidu: సీఎం జగన్ కు సున్నా మార్కులే - చంద్రబాబు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)