Bharat Jodo Yatra: మంత్రిగారూ మీరు ముందు ప్రధానికి లేఖ రాయండి - మన్‌సుక్‌పై గహ్లోట్ ఫైర్
Bharat Jodo Yatra: కేంద్ర ఆరోగ్యమంత్రి లేఖపై అశోక్ గహ్లోట్ తీవ్రంగా స్పందించారు.
Bharat Jodo Yatra:
అప్పుడు కొవిడ్ ప్రోటోకాల్ పాటించారా: అశోక్ గహ్లోట్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి రాహుల్‌కు లేఖ రాయటంపై కాంగ్రెస్ మండి పడుతోంది. కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి. అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ స్పందించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ మొదట ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని అన్నారు. "ఈ రోజు ఉదయానికి రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర ముగిసిపోయింది. ఈ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. ఇది చూసి బీజేపీ భయపడుతోంది. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని రాహుల్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి లేఖ రాయడం చాలా విచారకరం. కేవలం భారత్ జోడో యాత్రను నిలువరించాలన్న దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది" అని మండి పడ్డారు గహ్లోట్. ఆ తరవాత ప్రధాని నరేంద్ర మోడీపైనా విమర్శలు చేశారు. "రెండ్రోజుల క్రితం త్రిపురలో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఎలాంటి కొవిడ్ ప్రోటోకాల్ పాటించలేదు. సెకండ్ వేవ్‌లోనూ ప్రధాని బెంగాల్‌లో ర్యాలీలు నిర్వహించారు. ఒకవేళ ఆరోగ్య మంత్రి రాజకీయాలు చేయడం లేదని, కేవలం ప్రజారోగ్యం గురించే ఆలోచిస్తున్నారని రుజువు చేసుకోవాలంటే
ముందుగా ఆయన ప్రధాని మోడీకి లేఖ రాయాల్సి ఉంటుంది" అని తేల్చి చెప్పారు. మరో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ కూడా బీజేపీపై విమర్శలు చేశారు. కేవలం సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది..
రాహుల్ గాంధీకి.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ -19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఈ లేఖలో కోరారు. లేకుంటే.. జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌లకు లేఖ రాశారు.
" భారత్ జోడో యాత్రతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉంది. కనుక యాత్ర సమయంలో కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. మాస్క్‌లు, శానిటైజర్‌ల వినియోగాన్ని అమలు చేయాలి. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు మాత్రమే యాత్రలో పాల్గొనేలా చూడాలి. కొవిడ్-19 ప్రోటోకాల్‌ను అనుసరించడం సాధ్యం కాకపోతే.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలి. "
-మన్‌సుక్ మాండవీయ, కేంద్ర ఆరోగ్యమంత్రి
'భారత్ జోడో యాత్ర' కారణంగా తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తూ రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు డిసెంబరు 20న కేంద్ర మంత్రి మన్‌సుక్ మాండవీయకు లేఖ రాశారు. జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని వారు కోరారు. మాస్క్‌లు, శానిటైజర్లు ఉపయోగించాలని, వ్యాక్సిన్ వేసుకున్నవారినే యాత్రకు అనుమతించాలని కోరారు. ఈ లేఖపై స్పందించిన మన్‌సుక్ మాండవీయ.. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు లేఖలు రాశారు.
Also Read: Taj Mahal News: తాజ్‌మహల్‌కు పన్ను ఉంటుందా? నోటీసులు ఎందుకు వచ్చాయ్?