YS Sharmila: మీడియాలోనే రావాలా ఏంటి? లోకేశ్‌కు షర్మిల గిఫ్ట్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
Minister Roja: నారా ఫ్యామిలీ నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు అని తెలియజేశారు. అయితే, ఈ విషయంపై తాజాగా మంత్రి రోజా స్పందించారు.
![YS Sharmila: మీడియాలోనే రావాలా ఏంటి? లోకేశ్‌కు షర్మిల గిఫ్ట్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు Minister RK Roja responds over YS Sharmila gift to Nara lokesh Telugu news YS Sharmila: మీడియాలోనే రావాలా ఏంటి? లోకేశ్‌కు షర్మిల గిఫ్ట్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/e0bc5fa47204ff03997a6583f5c564fa1703591780436234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Roja comments on Sharmila Gift to Lokesh: సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా అయిన సంగతి తెలిసిందే. అందుకు లోకేశ్ కూడా ఎక్స్ లో ఓ పోస్టు చేస్తూ గిఫ్ట్ పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. నారా ఫ్యామిలీ నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు అని తెలియజేశారు. అయితే, ఈ విషయంపై తాజాగా మంత్రి రోజా స్పందించారు. మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన రోజా దర్శనం తర్వాత ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరిని ఈ అంశంపై స్పందించాలని మంత్రిని అడిగారు. నారా లోకేశ్ కు గిఫ్ట్ పంపిన వైఎస్ షర్మిల.. సీఎం జగన్ కు కనీసం శుభాకాంక్షలు కూడా ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన మంత్రి రోజా.. షర్మిల జగన్ కు శుభాకాంక్షలు తెలపలేదని మీకెలా తెలుసని ప్రశ్నించారు. మీడియాలో ఎక్కడా రాలేదని విలేకరులు అడగ్గా.. మీడియాలో రాకపోతే శుభాకాంక్షలు చెప్పినట్లు కాదా అని ప్రశ్నించారు. తాను కూడా తన సోదరులకు రాఖీలు కడుతుంటానని, పండగలకు శుభాకాంక్షలు చెబుతుంటానని.. ఆ వార్తలు ఏమైనా మీడియాలో వస్తున్నాయా అని అడిగారు.
ఎవరూ అసమ్మతితో లేరు - రోజా
సీఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చుతుండడంపై రోజా స్పందిస్తూ.. రాష్ట్రంలో జగనన్న పాలన విషయంలో ఎమ్మెల్యేలు ఎవరు అసంతృప్తిగా లేరని అన్నారు. అదంతా మీడియా సృష్టిస్తోందని కొట్టిపారేశారు. ఈసారి 175 సీట్లకు 175 సీట్లు గెలవడంలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీట్లను మార్చుతున్నారని అన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడితే బాగుంటుందో జగన్ కు తెలుసని అన్నారు. అంతేకానీ, ఎమ్మెల్యేల్లో ఎలాంటి అసమ్మతి లేదని చెప్పారు. నేడు (డిసెంబర్ 26) మంత్రి రోజా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అవసరమైతే నా సీటు కూడా త్యాగం చేస్తా
175 సీట్లు గెలవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామని అన్నారు. అవసరమైతే తన సీటు కూడా త్యాగం చేయడానికి తాను రెడీ అన్నారు. తాను ఒకసారి ఎమ్మెల్యే అయి ప్రజలకు సేవ చేస్తే చాలనుకున్నానని, అలాంటిది జగన్ తనకు రెండు సార్లు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాక, జగన్ తనను మంత్రిని కూడా చేశారని చెప్పారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని, అయినా తాను జగనన్నతోనే ఉంటానని రోజా స్పష్టం చేశారు. ‘‘జగనన్న నగరి ఎమ్మెల్యే విషయంలో టికెట్ లేదంటే మనస్పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని రోజా అన్నారు.
అంతకుముందు మంత్రి రోజా ఆడుదాం ఆంధ్రా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం (డిసెంబర్ 26) గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. అనంతరం క్రీడాకారులకు క్రికెట్ కిట్లను పరిశీలించి జట్టు ఆటగాళ్లకు అందజేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా.. సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)