Minister RK Roja: అన్ స్టాపబుల్ షోపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు - బావ ఆనందం కోసమే అలా చేశారంటూ ఫైర్
Minister RK Roja: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఆర్కే రోజా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు.
Minister RK Roja: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఆర్కే రోజా శుభాకాంక్షలు తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ముగ్గుల పోటీలు నిర్వహించిన గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఒక చెల్లిగా, హీరోయిన్ గా, మంత్రిగా ప్రతి ఏడాది ఇక్కడే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నానని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో రైతులు అంతా ఆనందంగా ఉన్నారని.. చాలా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో రైతులు సభిక్షంగా ఉంటారని వివరించారు.
నటుడు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బావ మోసాలు కప్పిపుచ్చేందుకు బాలకృష్ణ చాలా కష్టపడుతున్నారని ఫైర్ అయ్యారు. అన్ స్టాపబుల్ కార్యక్రమం కేవలం స్క్రిప్ట్ అని ప్రజలు గ్రహించారని తెలిపారు. ప్రజలు ఎలా ఉన్నా.. బావ మీటింగ్ జరగాలి, బావ కళ్లలో ఆనందం చూడాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి.. వారి డబ్బ్బుతో మేడలు కట్టుకుని, ఆ ప్రజలు చనిపోతే వారి పట్ల సానుభూతి చూపకపోవడం... ఆ విషయం గురించి మాట్లాడక పోవడం ముమ్మాటికీ తప్పే అని అన్నారు. ధాన్య బండాగారంగా పేరొంది.. మూడు పంటలు పండే భూమిని ఓ స్వామీజి చెప్పిన మాటలు విని బీడు భూమిగా మార్చారని ఆరోపించారు. మహిళా సదస్సుకు ఆహ్వానం పంపి టీడీపీ నాయకులు తనను చంపాలని చూసినట్లు ఆరోపించారు. ప్రజాపోరులో బాలకృష్ణ రెండు సార్లు గెలిచారని, అలాంటి బాలకృష్ణకి ప్రజల కష్టాలు బాగా తెలుసనీ అన్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓడిపోయిన పవన్ కి తెలియకపోవచ్చని చురకలు అంటించారు.
జీవో నంబర్ వన్ పూర్తిగా చదవకుండానే బాలకృష్ణ ఎమర్జెన్సీ అనే మాట మాట్లాడటం సబబు కాదని... పూర్తిగా చదివితే తన మాటను వెనక్కి తీసుకుంటానని మంత్రి రోజా చెప్పారు. ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు అని నీతి మాలిన రాజకీయాలకు పరాకాష్ట అంటూ మండిపడ్డారు. సినిమాల్లో చెప్పే డైలాగులు కేవలం చప్పట్ల కోసమే అని అలాంటి డైలాగులతో పల్లెలు బాగుపడవని రోజా అన్నారు. బాలకృష్ణ ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్ధం కావడం లేదన్నారు. బాలకృష్ణ గత ప్రభుత్వం పనితీరు చూసి ఇంకా అదే విధంగా ఉందనే అనుకుంటున్నాడని... చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలని కోరారు. స్క్రిప్టులు రాసిచ్చినా మాట్లాడలేని పరిస్థితి బాలకృష్ణది అంటూనే....11 మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ జీవో నెంబర్ 1ని పూర్తిగా చదివారా అని అడిగారు. జగనన్న ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదం అని విమర్శించారు. తన అల్లుడు, కూతురు బాగుండాలని తన బావ మెప్పుకోసం ఇలా మాట్లాడి ఉండొచ్చని అన్నారు.