Gudivada Amarnath: బొమ్మల ఎగుమతి హబ్‌గా ఆంధ్రప్రదేశ్- వెయ్యి ఎకరాల్లో టాయ్ పార్క్ ఏర్పాటు: మంత్రి అమర్నాథ్
Minister Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ బొమ్మల ఎగుమతి హబ్‌గా మారబోతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో టాయ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు.
Minister Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ బొమ్మల ఎగుమతి హబ్‌గా మారబోతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బొమ్మలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు పల్స్ ప్లష్ కంపెనీ రూపొందించిన గ్లోబల్ ఇ-కామర్స్ పోర్టల్‌ను గాజువాకలోని గ్రీన్ సిటీలో మంత్రి అమర్‌నాథ్ ప్రారంభించారు. ఈ కంపెనీ తయారు చేసిన బొమ్మలను అమెరికాలోని వివిధ నగరాలకు ఎగుమతి చేయనుంది.
పోర్టల్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన అమర్... వెయ్యి ఎకరాల్లో బొమ్మల పరిశ్రమ పెట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని.. సీఎం జగన్ ను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఏపీలో తయారైన బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. ఇటీవల తాను శ్రీ సిటీని సందర్శించినప్పుడు దేశంలో బొమ్మల మార్కెట్ ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, దేశ వ్యాప్తంగా ఏటా ఏడు నుంచి 8 లక్షల కోట్ల విలువైన బొమ్మలు అమ్ముడు అవుతున్నాయని తెలిపారు. బొమ్మల తయారీలో చైనా అగ్రస్థానంలో ఉందని, ఆంధ్ర ప్రదేశ్ త్వరలో బొమ్మల ఎగుమతి హబ్‌గా మారనుందని అన్నారు. ఏపీలో టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తే 30 నుంచి 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
30 ఏళ్లుగా బొమ్మల తయారీ రంగంలోనే ఉన్న అజయ్ సిన్హా..
ఈ సందర్భంగా పల్స్ ప్లష్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అజయ్ సిన్హా మాట్లాడారు. బొమ్మల తయారీ అంటే తనకు చాలా ఇష్టం అని.. దేశం, విదేశాల్లో ఉన్న అనేక సంస్థలలో దాదాపు 30 సంవత్సరాలుగా ఈ రంగంలో కీలక పాత్రలు పోషించానని చెప్పారు. ఈ బొమ్మలు 1995లో నోయిడాలో తయారు అయ్యాయని, డిస్నీ లైసెన్స్ దేశంలోని తన కంపెనీకి మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు.
1997 నుంచి 2000 వరకు తమ కంపెనీ తయారు చేసిన బొమ్మలను ఇతర దేశాలకు ఎగుమతి చేశామని చెప్పారు అజయ్ సిన్హా. నాణ్యమైన బొమ్మలను తయారు చేయడమే తమ లక్ష్యమని వివరించారు. అయితే ఆ సమయంలో ముడి సరుకు సమస్యను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాణ్యమైన బొమ్మల తయారీలో వెనుకడుగు వేయకూడదనే లక్ష్యంతో.. 2011-12 మధ్య కాలంలో తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో పల్స్ ప్లష్ బొమ్మల తయారీని ప్రారంభించినట్లు తెలిపారు.
సంస్థను మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు
శ్రీసిటీలోని ఐదెకరాల పరిశ్రమలో ఎగుమతి అనుకూలమైన బొమ్మలను తయారు చేస్తున్నట్లు అజయ్ సిన్హా తెలిపారు. కాకినాడలోని 300 ఎకరాల్లో బొమ్మల తయారీ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో తమ కార్యకలాపాలను విశాఖపట్నం నగరానికి మార్చినట్లు అజయ్ సిన్హా వెల్లడించారు. ప్రస్తుతం విశాఖలో నిర్వహిస్తున్న తమ సంస్థను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖలో తయారవుతున్న బొమ్మలు గ్లోబల్ ఇ-కామర్స్ ద్వారా న్యూయార్క్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలోని మరిన్ని నగరాల్లో కూడా విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తమ బొమ్మలను తైవాన్, సౌత్ కొరియ సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు పేర్కొన్నారు అజయ్ సిన్హా.