AP Politics: అవినీతి, అన్యాయం చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: ఏపీ మంత్రి ధర్మాన
AP Politics: తన జీవితంలో అన్యాయంగా, అవినీతిగా ఒక్క పని చేసినట్లు ఎవరైనా వేలెత్తి చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు.
AP Politics: తన జీవితంలో అన్యాయంగా, అవినీతిగా ఒక్క పని చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళా మందిరంలో ఆదివారం జరిగిన సూత్రా ఫౌండేషన్ సంస్థ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ రాజధాని భవిష్యత్తులో అవసరం అన్నారు. కానీ తగువులు పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని ఓ పత్రికలో రాసినట్లు తెలిపారు. రాజధాని పెడితే తగువులు ఎందుకు వస్తాయని ధర్మాన ప్రసాద రావు ప్రశ్నించారు. రాష్ట్ర సంపద విజయవాడలో పెడితే తర్వాత వారు వెళ్లిపోమంటారని చెప్పుకొచ్చారు. గతంలో హైదరాబాద్ లో పెట్టుబడి పెడితే ఏమైందని అన్నారు. ఆ అనుభవం ఉండగా మళ్లీ అధి చేస్తామంటే తప్పు కదా.. రాజధాని ఏఎక్కడ ఉంటే అక్కడ పెట్టుబడులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఉపాధి అకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అందరినీ మోసం చేశారని, రియల్ ఎస్టేట్ దోపిడీ కోసం రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా అవరావతిని రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. శ్రీకాకుళం ప్రాంతవాసుల గొంతై నిజాయతీగా వాదిస్తా అన్నారు. అది ప్రజాప్రతినిధిగా తన పని, కర్తవ్యం అని చెప్పుకొచ్చారు. తాను రామోజీ రావు, చంద్రబాబులకు భయపడే రకం కాదన్నారు. తన గళం వినిపించేందుకు ఎమ్మెల్యేగానే ఉండక్కర్లేదని అన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజలు ఆశలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. వాళ్ల నోరు నొక్కే ప్రయత్నం చేయకూడదన్నారు.
తప్పు చేస్తే చెప్పండి.. సరిదిద్దుకుంటాం..!
విశాఖపట్నాన్ని రాజధానిని చేయాలని ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసులు నోరు ఎందుకు విప్పడం లేదని, ఎందుకు అంత కష్టంగా ఉందని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జై అనడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ఉత్తరాంధ్ర వాసులను మంత్రి ధర్మాన ప్రశ్నించారు. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందని మీకు అనిపిస్తే చెప్పండని, సరిదిద్దుకుంటామని ధర్మాన ప్రసాద రావు విజ్ఞప్తి చేశారు.
ప్రాంతాల అభివృద్ధి కంటే తనకు మంత్రి పదవి గొప్ప కాదని మంత్రి ధర్మాన వెల్లడించారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి పోవడం కంటే తనకు పదవి ఏం గొప్ప కాదని తెలిపారు. తాను రేపో మాపో రాజకీయాల నుండి పదవీ విరమణ పొందనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం రాజధాని విషయంలో రాష్ట్ర యువతే ఆలోచించుకోవాలని మంత్రి కోరారు. అమరావతిలో అన్ని వసతులతో రాజధానిని నిర్మించాలంటే లక్షలాది కోట్ల రూపాయలు కావాలని, అదే విశాఖలో రాజధానిని కొనసాగించేందుకు కేవలం రూ. 1500 కోట్లు సరిపోతుందని రెవెన్యూ మినిస్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష నెరవేర్చేందుకు తామంతా సమిధలుగా మారతామని వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే విభజన ఉద్యమం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి నష్టం వచ్చేది కాదని అన్నారు.