(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Excise Policy Case:సిసోడియా భారత రత్నకు అర్హుడు, 70 ఏళ్లలో ఎవరూ చేయలేంది చేసి చూపించాడు - కేజ్రీవాల్
Delhi Excise Policy Case: మనీష్‌తో పాటు తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
Delhi Excise Policy Case:
గుజరాతీలకూ మెరుగైన విద్య, వైద్యం..
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన...కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. "మనీష్ సిసోడియా విద్యారంగంలో చేసిన సేవలు చాలా గొప్పవి. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేనివి ఆయన చేయగలిగాడు. ఆయన భారతరత్నకు కూడా అర్హుడు. కానీ..కేంద్రం కుట్ర పన్నుతూ సీబీఐ అస్త్రం వినియోగిస్తోంది" అని అన్నారు. "మనీష్ సిసోడియా అరెస్ట్ అవుతారు. బహుశా నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో ఎవరికి తెలుసు..? ఇదంతా కేవలం గుజరాత్ ఎన్నికల కోసమే" అని విమర్శించారు కేజ్రీవాల్. గుజరాత్ ప్రజలు భాజపాను 27 ఏళ్లుగా భరిస్తున్నారని, వాళ్ల అరాచక పాలనలో వాళ్లు మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్..ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని గెలిపిస్తే... మెరుగైన విద్య,వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గుజరాతీలందరికీ ఉచిత వైద్యం అందిస్తామనీ చెప్పారు. "ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో గుజరాత్‌లోనూ పట్టణాలు, గ్రామాల్లో హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తాం. ఉన్న ప్రభుత్వాసుపత్రులను బాగు చేయటమే కాకుండా.. కొత్త ఆసుపత్రులనూ అందుబాటులోకి తీసుకొస్తాం" అని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని బస్ డ్రైవర్లు, కండక్టర్లు...ఆప్‌నకు ఓటు వేయాలని ప్రయాణికులకు చెప్పాల్సిందిగా కోరారు. ఢిల్లీ తరహాలోనే గుజరాత్‌లోనూ మెరుగైన పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
We're guaranteeing that we'll provide free & best health treatment to all Gujaratis. Like Mohalla clinics, health clinics will be opened in cities & villages. We'll improve govt hospitals & new government hospitals will be opened if needed: AAP National Convenor Arvind Kejriwal pic.twitter.com/3ayf83i6KM
— ANI (@ANI) August 22, 2022
భాజపాలో చేరమంటూ పిలుపు: సిసోడియా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సృష్టించిన అలజడి కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దేశమంతా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం స్కామ్‌లో తెరాసలోని పెద్దలు కీలక పాత్ర పోషించారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. అటు..సీబీఐ ఈ కేసులో 8 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అటు ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా భాజపాపై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపివేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లుకౌట్ నోటీసులు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ మొత్తం 8 మందికి లుకౌట్ ( Lookout)నోటీసులు జారీ చేసింది. వీరందరూ ఈ కేసులో నిందితులేనని భావిస్తోంది. FIRలో మొత్తం 9 మంది పేర్లుండగా...8 మందికి ఈ నోటీసులిచ్చింది. వీళ్లంతా ప్రైవేట్ వ్యక్తులే. Pernod Ricard కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ రాయ్ పేరు కూడా FIRలో ఉన్నా..ఆయనకు నోటీసులు పంపలేదు. ఈ నోటీసులు రాకముందే...ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే సీబీఐ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఇది ఢిల్లీలో రాజకీయ దుమారం రేపింది.