Maharashtra New Governor: మహారాష్ట్రకు కొత్త గవర్నర్, కొషియారి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
Maharashtra New Governor: మహారాష్ట్రకు కొత్త గవర్నర్‌గా రమేశ్ బైస్‌ను నియమించారు.
Maharashtra New Governor:
మహారాష్ట్రకు కొత్త గవర్నర్ అపాయింట్ అయ్యారు. వరుస వివాదాలతో అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చి పెట్టిన భగత్ సింగ్ కొషియారి చివరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ రాజీనామాను ఆమోదించిన అధిష్ఠానం...కొత్త గవర్నర్‌ను నియమించింది. ఝార్ఖండ్ గవర్నర్ రమేశ్ బైస్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా అపాయింట్ చేసింది. ఇదే సమయంలో ఝార్ఖండ్‌లో రమేశ్ బైస్ స్థానంలో సీపీ రాధాకృష్ణన్‌కు అవకాశమిచ్చింది. ప్రస్తుతం సీపీ రాధాకృష్ణన్ లద్దాఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ పదవికి రాజీనామా చేసి...ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. వివాదాల్లో చిక్కుకున్న తరవాత మాజీ గవర్నర్ భగత్ సింగ్ కొషియారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని, రిటైర్ అయిపోవాలని అన్నారు. రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా గడపాలని చెప్పినట్టు ఆ మధ్య మహారాష్ట్ర రాజ్‌భవన్ ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. అప్పటి నుంచే మహారాష్ట్రకు కొత్త గవర్నర్‌గా ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది. మొత్తానికి ఈ చర్చకు తెర దించుతూ రమేశ్ బైస్‌ను ఎంపిక చేసింది.
ముందే చెప్పారు..
అయితే తాను రాజీనామా చేయబోతున్న విషయాన్ని.. ఇటీవల ముంబయి పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలిజేశానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు కొషియారి. "నేను అన్ని రాజకీయ పదవుల నుంచి వైదొలగాలనుకుంటున్నాను. నా శేష జీవితం అంతా రాయడం, చదవడం తో పాటు ఇతర కార్యకలాపాలతో గడపాలనేదే నా కోరిక" అని వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి తాను రాష్ట్ర సేవకుడిగా, గవర్నర్‌గా పని చేయడం తనకు చాలా సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని చెప్పారు. గత మూడేళ్లకు పైగా మహారాష్ట్ర ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆప్యాయతలను తాను ఎప్పటికీ మరచిపోలేనని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి తనకు ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయత లభిస్తూనే ఉంటాయని అన్నారు. అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలపై చాలా వివాదం నెలకొంది.
వివాదాస్పదం..
ఛత్రపత్రి శివాజీ చేసిన కామెంట్స్ మహారాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా మండి పడుతోంది. ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ బీఆర్ అంబేడ్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అని ఆయన చేసిన కామెంట్స్‌తో పెద్ద దుమారం రేగింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో పాటు ఠాక్రే నేతృత్వంలోని శివసేన విమర్శలు ధాటిని పెంచింది. "ఇది ఛత్రపతి శివాజీకి తీరని అవమానం" అని విమర్శిస్తున్నాయి. ఔరంగాబాద్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అండేక్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు...గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ. ఆ సమయంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఒకప్పుడు భారత్‌లో ఐకాన్ లాంటి వ్యక్తులెవరంటే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అని సమాధానం ఇచ్చేవారు. కానీ...మహారాష్ట్ర ఈ విషయంలో ప్రత్యేకం. ఇక్కడ ఎంతో మంది గొప్ప వ్యక్తులున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఒకప్పటి ఐకాన్. కానీ ఇప్పుడు అంబేడ్కర్, నితిన్ గడ్కరీ ఆ స్థాయిలో ఉన్నారు" అని అన్నారు ఈ మాజీ గవర్నర్.
Also Read: Formula E Racing : హైదరాబాద్ లో గ్రాండ్ గా ముగిసిన ఫార్ములా ఈ రేసింగ్, విజేతగా నిలిచిన జా ఎరిక్