Online Games : పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలయ్యారని బాధపడుతున్నారా ? కొత్త చట్టం రాబోతోంది..
పిల్లలు ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసలు అవుతున్న వైనంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. వీడియో గేమ్స్ నియంత్రించాలని నిర్ణయించుకుంది.
ఆన్‌లైన్ గేమ్స్ ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్..ల్యాప్ ట్యాప్ ఇస్తే వాటితో వీడియో గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటున్నారు పిల్లలు. అంతే కాదు వాటికి బానిసలుగా మారిపోతున్నారు. చివరికి తల్లిదండ్రులకు తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా కట్టి ఆడుతున్నారు. చివరికి తెలిసి మందలిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు వేలల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఓ పదకొండేళ్ల బాలుడు ఇలా వీడియో గేమ్స్‌కు బానిసయ్యాడు. తల్లిదండ్రులు మందలించే సరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని.. సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. వీడియోగేమ్‌లను రెగ్యూలేట్ చేసే చట్టం తీసుకు రావాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి బిల్లుకు ఇప్పటికే ఓ రూపం వచ్చిందని.. తరవాత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెడతామని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ .. వీడియో గేమ్స్‌కు బానిసలైన పిల్లల ఆత్మహత్యలు... మానసిక వ్యాధులకు గురైన వారి గురించి తరచూ ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి.
చట్ట విరుద్ధమైన వీడియో గేమింగ్‌పై ఇప్పటికే అనేక ఆంక్షలు ఉన్నాయి. జూదాన్ని ప్రోత్సహించే వీడియో గేములపై నిషేధం విధించారు. అయితే పిల్లలు ఆడే వీడియో గేమ్స్‌పై ఇప్పటికీ నియంత్రణ లేదు. వీడియో గేమ్స్‌కు బానిసలైన కొన్ని వేల మంది పిల్లలు తమ భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారన్న నివేదికలు.. ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ వాటిని రెగ్యూలేట్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు పెద్దగా చేయలేదు. తొలి సారి మధ్యప్రదేశ్ ఆ ప్రయత్నం చేస్తోంది... ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తే.. విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా పెద్ద రిలీఫ్ దొరికినట్లే భావించాలి.
Also Read: China Zero Covid Strategy: అక్కడ అంతే.. ఎదిరిస్తే జైల్లోకి.. అనుమానమొస్తే బోనులోకి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి