Madhya Pradesh: అదృష్టం అంటే ఈ రైతులదే, విలువైన డైమండ్‌ను దక్కించుకున్నారు
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని రైతులకు మైనింగ్‌లో డైమండ్ దొరికింది.
Madhya Pradesh:
మధ్యప్రదేశ్‌లో..
టైమ్ ఎప్పుడు ఎవరి ఎలా కలిసొస్తుందో తెలియదు. అందుకే...బండ్లు ఓడలవుతాయి అంటారు. కొందరికి కోట్ల రూపాయల లాటరీ తగులుతుంది. ఇంకొందరికి ఇంకేదో రూపంలో లక్ వచ్చేస్తుంది. మధ్యప్రదేశ్‌లో రైతులకూ ఇలానే అదృష్టం వరించింది. తాము లీజ్‌కు తీసుకున్న ఓ మైన్‌లో తవ్వకాలు జరుపుతుండగా వజ్రం దొరికింది. లల్కీ ధేరి ప్రాంతంలో డైమండ్ మైన్ ఉంది. ఇటీవలే అధికారులతో మాట్లాడి ఆ మైన్‌ను లీజ్‌కు తీసుకున్నారు కొందరు రైతులు. దాదాపు 10 నెలల క్రితం తవ్వకాలు మొదలు పెట్టారు. ఇన్నాళ్లకు ఓ డైమండ్ వారి కంట పడింది. పన్నాలోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లారు. డైమండ్ ఆఫీస్‌లో దాన్ని డిపాజిట్ చేశారు. ఇది 3.21 క్యారెట్ల డైమండ్ అని తేలింది. జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన రాజేష్ గుప్తాతో పాటు మరో ఆరుగురు రైతులు ఈ తవ్వకాలు చేపట్టారు. ఎంతో కాలంగా వాళ్లు వజ్రం కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు డైమండ్ దొరకగానే వాళ్లు ఉప్పొంగిపోతున్నారు.
వచ్చిన డబ్బుతో వ్యాపారం..
ఈ వజ్రం అమ్మేసిన తరవాత వచ్చే డబ్బుని రైతులందరూ సమానంగా పంచుకుంటారట. మొత్తం ఏడుగురు రైతులు ఈ డబ్బుతో కొత్తవ్యాపారం మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏరియాలోని జెమ్మాలజిస్ట్ (Gemmologist) రైతులకు ఇంకా కిక్ ఇచ్చే విషయం చెప్పాడు. వాళ్ల తవ్వకాల్లో బయటపడ్డ ఈ డైమండ్ చాలా విలువైందట. అమ్మకానికి పెడితే భారీ మొత్తమే వస్తుందని చెప్పాడు. ఇది తెలిశాక..రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అదృష్టాన్ని చూసుకుని తామే మురిసిపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం...గవర్నమెంట్ పరిధిలో లేని మైన్స్, ఫీల్డ్స్‌లో ఏదైనా విలువైన వస్తువు దొరికితే...అది దొరికిన వారికి మొత్తం వాల్యూలో 12.50% మాత్రమే వాటా వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం డైమండ్ దొరకటాన్ని గమనించి నోటిఫై చేయకపోతే...ఈ విషయం కోర్టు పరిధిలోకి వెళ్తుంది. అప్పుడు ఆ డైమండ్ దొరికిన వ్యక్తి న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ వజ్రం తనకే దొరికిందని రుజువులు చూపించాలి. ఈ ఏరియాలో ఇలా డైమండ్ దొరకటం రెండోసారి. పన్నాలోని జరువపూర్ గ్రామంలో రూ.30 లక్షల విలువైన వజ్రం ఓ రైతుకు దొరికింది. దాదాపు రెండేళ్ల పాటు తవ్వకాలు జరిపితే...ఈ వజ్రం కనిపించింది.
విలువైన పింక్ డైమండ్..
ఈ మధ్య కాలంలో ఇలాంటి విలువైన వజ్రాలు ఎక్కడో ఓ చోట దొరుకుతున్నాయి. ఆంగోలా వజ్రాల గనుల్లో అతిపెద్ద పింక్ డైమండ్ లభ్యమైంది. గడిచిన 300 ఏళ్లలో ఇలాంటి వజ్రాన్ని చూడలేదని నిపుణులు ప్రకటించారు. లూలా రోజ్‌గా పిలుస్తున్న ఆ వజ్రం.. లూలో మైన్‌లో దొరికింది. అది 170 క్యారెట్ పింక్ డైమెండ్ అని లుకాపా డైమెండ్ కంపెనీ పరీక్షలు చేసి తేల్చింది. అతి సహజమైన రీతిలో దొరికిన అతి అరుదైన వజ్రాన్ని పొందడంపై అంగోలా ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది. లూలో మైన్ నుంచి పింక్ వజ్రం లభించడం ఇది రెండవసారి. భారీ ధరకు ఆ వజ్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాలని అంగోలా ప్రభుత్వం భావిస్తోంది. అంగోలాలో ఉన్న ఈ మైన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కారణంగా ఈ వజ్రంపై రెండు దేశాలకూ హక్కు ఉంటుంది.