Teeth Regrow: ఊడిపోయిన దంతాలు మళ్లీ పెంచుకోవచ్చు, జపనీస్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి
Teeth Regrow: జపనీస్ శాస్త్రవేత్తలు అద్భుతమైన ఔషధాన్ని కనిపెట్టారు. దాంతో ఊడిపోయిన దంతాల స్థానంలో కొత్తవి వస్తాయి.
![Teeth Regrow: ఊడిపోయిన దంతాలు మళ్లీ పెంచుకోవచ్చు, జపనీస్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి Lost Teeth Can Grow Back, A Miraculous Creation Of Japanese Scientists Teeth Regrow: ఊడిపోయిన దంతాలు మళ్లీ పెంచుకోవచ్చు, జపనీస్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/863a37ab90e4f080361ee578189cd2361688971832822519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Teeth Regrow: వైద్యరంగంలో మరో అద్భుతాన్ని సుసాధ్యం చేసే దిశగా జపనీస్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దంతాలను తిరిగి పెంచుకునేలా చేసే అద్భుతమైన ఔషధాన్ని వైద్య రంగంలో విప్లవం తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఔషధాన్ని 2030 నాటికి మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. 2024 జులై నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
దంతాల లేమి సమస్యను పరిష్కరించడం
టూత్ ఎజెనిసిస్.. పుట్టుకతోనే దంతాలు పూర్తిగా లేదా పాక్షికంగా లేకపోవడానికి దారి తీసే పరిస్థితి. పుట్టుకతో పాటు వచ్చే ఈ సమస్యను పరిష్కరించడం కోసం జపనీస్ శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఔషధం అందుబాటులోకి వస్తే.. ప్రపంచ జనాభాలో ఈ టూత్ ఎజెనిసిస్ తో బాధపడుతున్న సుమారు 1 శాతం మందికి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. వయోజన దంతాలు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల నమలడం, మింగడం లాంటి ప్రాథమిక పనుల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే మాట్లాడుతున్నప్పుడు కూడా సమస్య వస్తుంది.
పళ్లు పూర్తిస్థాయిలో రావడానికి ఔషధం
ఒసాకాలోని మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కిటానో ఆస్పత్రిలో డెంటిస్ట్రీ, ఓరల్ సర్జరీ విభాగ అధిపతిగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్త కట్సు తకాహషి 1990 ప్రారంభం నుంచి ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నారు. దంతాల పెరుగుదలను USAG-1 అనే ప్రోటీన్ నిరోధిస్తుందని, ఆ ప్రోటీన్ ను తటస్థీకరిస్తే దంతాల పెరుగుదల సాధ్యమేనని తకాహషి బృందం పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనల నివేదిక 2021లో యూఎస్ సైంటిఫిక్ పేపర్ లో ప్రచురితమయ్యాయి. అప్పుడు ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. తకాహషి బృందం చేసిన కృషి, వాళ్లు కనిపెట్టిన విషయాలు.. దంతాల పునరుత్పత్తి ఔషధాల అభివృద్ధికి అడుగులు వేశాయి. అలా తయారీ చేసిన తాజా ఔషధం.. మానవ వినియోగానికి సురక్షితమైనదో కాదో నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ ఔషధం సురక్షితమే అని తేలితే.. దానిని 2-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు అందుబాటులోకి తీసుకువస్తారు. అనోడోంటియాతో ఇబ్బంది పడే పిల్లల్లో పళ్లు పూర్తి స్థాయిలో రావడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుంది.
దంతాలు కోల్పోవడం, కావిటీస్, పైయోరియా వంటి కారణాల వల్ల.. టూత్ ఇంప్లాంట్ లు లాంటివి ప్రస్తుతం అందరూ వాడుతున్నారు. ఊడిపోయిన దంతాలు లేదా కావిటీస్ వల్ల తీసేసిన దంతాల స్థానంలో కొత్తవి పుట్టించడం అనేది వైద్య శాస్త్రంలో విప్లవాత్మకం కాబోతుంది. పళ్ల సెట్టు వాడటం, దంతాలు ఇంప్లాంట్ చేయడంతో పాటు పళ్లను తిరిగి పెంచే ఈ ఔషధం భవిష్యత్తులో కీలకంగా మారనున్నట్లు తకాహషి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)