Lok Sabha Elections 2024 Results: దేశంలో మళ్లీ సంకీర్ణ రాజకీయాలు చూస్తామా, ఫలితాల ట్రెండ్ ఏం చెబుతోంది?
Lok Sabha Elections 2024 Results: దేశంలో మరోసారి సంకీర్ణ రాజకీయాలు మొదలవుతాయన్న ఆసక్తికర చర్చ మొదలైంది.
Elections 2024 Results: ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని లోక్‌సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ని బట్టి తెలుస్తోంది. 400 సీట్ల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన NDA కూటమి చతికిలబడింది. ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేదని అనుకున్న ఇండీ కూటమి గట్టిగానే పుంజుకుంది. దాదాపు 230 చోట్ల లీడ్‌లో ఉంది. అటు NDA 295 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా ఈ సినారియో చూస్తే మళ్లీ దేశంలో సంకీర్ణ రాజకీయాలు మొదలు కానున్నాయా అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. బీజేపీ సొంతగానే 370 సీట్లు సాధిస్తామని ప్రచారం చేసుకుంది. అదే ధీమాతో ఉంది. యూపీ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. ఫలితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో వెనకబడింది. సాయంత్రం 5 గంటల సమయానికి లెక్కలు చూస్తే బీజేపీ సొంతగా 241 చోట్ల లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 100 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే..రెండు కూటములు పోటాపోటీగా ఉన్నాయి. అందుకే మళ్లీ కూటమి ప్రభుత్వాల తీరుపై చర్చ జరుగుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సంకీర్ణ రాజకీయాలను దేశం ప్రత్యక్షంగా చూస్తూనే ఉంది.
మళ్లీ సంకీర్ణ రాజకీయాలు..?
1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ తరవాత ఈ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జనతా పార్టీ అధికారాన్ని సాధించింది. ఇందిరా గాంధీని గద్దె దించేందుకు జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్ట్ పార్టీ సహా ఆరు పార్టీలు కలిసిపోయాయి. ఆ తరవాత 1980లో మళ్లీ ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు మొదలైన ఈ సంకీర్ణ రాజకీయాలు చాలా ఏళ్ల పాటు కొనసాగాయి. 1998 నుంచి 2004 వరకూ అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో NDA అధికారంలో ఉంది. ఆ తరవాత 2004-14 వరకూ యూపీఏ కూటమి పదేళ్ల పాటు పరిపాలించింది. ఇప్పుడు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడం వల్ల కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందన్న వాదన మొదలైంది. సొంతగా బీజేపీ మెజార్టీ మార్క్ సాధిస్తే పరవాలేదు. అలా కాకుండా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే సమస్యలు తప్పవన్నది మరో వాదన. అటు కాంగ్రెస్‌కి ఎలాగో మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశమే లేదు. కానీ మిగతా మిత్రపక్షాలతో కలిస్తే గట్టిగానే బలం పెరుగుతుంది. ఒకవేళ NDA లోని కొన్ని పార్టీలు ఇండీ కూటమిలోకి వచ్చేస్తే అప్పుడు పరిస్థితేమిటన్నది మరో ప్రశ్న. ఇప్పటికే ఇండీ కూటమి నితీశ్ కుమార్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఒకవేళ నితీశ్ మళ్లీ ఇండీ కూటమిలో చేరితే అప్పుడు ఆ అలియన్స్‌కి మరింత బలం పెరగడం ఖాయం. ఎవరితోనూ చర్చించకుండా తదుపరి కార్యాచరణ ఏంటో చెప్పలేమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. త్వరలోనే భేటీ అవుతామని, ఆ తరవాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.